
ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్. ఆయన రేంజ్ గ్లోబర్ స్థాయికి చేరుకుంది. అందుకే ప్రభాస్ సినిమాల్లో నటించడానికి ఏకంగా హాలీవుడ్ యాక్టర్స్ కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఫౌజీ, రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్.
ఈ రెండూ తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దీని తర్వాత స్పిరిట్ సెట్స్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. స్పిరిట్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.
పోలీస్ స్టోరీలు ఇప్పటి వరకు చాలానే వచ్చాయి కానీ ఇలాంటి కథ మాత్రం ఎప్పుడూ రాలేదంటున్నారు సందీప్. ప్రీ ప్రొడక్షన్ అంతా పక్కాగా చేసుకుంటున్నారు ఈ దర్శకుడు. జూన్ నుంచి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.
స్పిరిట్ సినిమా క్యాస్టింగ్ విషయంలో చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడగట్లేదు గానీ విలన్‌పై మాత్రం గాసిప్స్ మామూలుగా లేవు. సంజయ్ దత్, విజయ్ సేతుపతిలలో ఒకరు స్పిరిట్‌లో విలన్‌గా నటిస్తారని ప్రచారం జరుగుతుంది. వీళ్లిద్దరితో పాటు కొరియన్ నటుడు డాంగ్ లీ కూడా రేసులో ఉన్నారు.
యానిమల్‌లో బాబీ డియోల్ క్యారెక్టర్‌ను సందీప్ రెడ్డి వంగా డిజైన్ చేసిన తీరు చూసాక.. ఈయన సినిమాలో విలన్‌గా నటించాలని చాలా మంది నటులు ఆశ పడుతున్నారు. ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో అని అభిమానులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే విజయ్, సంజయ్, డాంగ్ లీ మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. మరి వీళ్లలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.