
ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చిన లడ్డూ.. అలాంటి ఇలాంటి లడ్డూ కాదు.. పోషకాల బాండగారం. మహిళల రక్తహీనతను దూరం చూసి ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తున్న లడ్డూ అది. నిన్న మొన్నటివరకు మత్తెక్కించే సారాయిగా ఆదివాసీ గూడాలు, తండాలను గమ్మత్తుకు గురి చేసిన ఆ లడ్డూ ముడిసరుకు ఇప్పుడు ఆరోగ్య దాతగా మారి భారత ప్రధానమంత్రి ప్రశంసలు అందుకుంది. ఆ లడ్డూ కథా కమామిసి తెలుసుకోవాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే..!
ఇప్పపువ్వు.. వేసవి కాలంలో మాత్రమే లభించే ప్రత్యేకమైన పువ్వు. ఈ పువ్వు ఆదివాసీలకు ఆర్థిక వనరుగా మారి జీవనోపాదినిస్తోంది. గత దశాబ్దం క్రితం ఈ ఇప్పపూలతో నాటు సారా తయారుచేసే వారే గిరిజనులు. ప్రభుత్వం సహయ సహకారాలు అందించడంతో గిరిజన మహిళల రక్తహీనతను తగ్గించేందుకు ఇప్ప పువ్వుతో లడ్డూలను తయారు చేసేందుకు ముందుకొచ్చారు ఆదివాసీ గిరిజన మహిళలు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో దేశంలోనే తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద భీంబాయి సహాకార సంఘం పేరిట ఇప్పపువ్వు లడ్డూల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,845, కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణులకు ఈ ఇప్పపువ్వు లడ్డూలను అధికారులు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు ఈ లడ్డూలను సరఫరా చేస్తున్నారు. అధికారులు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్పపువ్వు లడ్డూలను భీంబాయి సంఘం నుంచి కొనుగోలు చేసి విద్యార్థినులకు అందిస్తున్నారు.
మన్ కీ బాత్‌లో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించడంతో సర్వత్ర ఇప్పపువ్వు లడ్డూ చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారన్నారు మోడీ. రకరకాల వంటలు చేస్తున్నారని.. వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటున్నారని… వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయం, కమ్మదనం కనిపిస్తుందని ప్రదాని మోదీ ప్రశంసించారు. ప్రధాని ప్రశంసించడంపై భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమ్ర భాగుబాయి, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు.
ఇప్పపువ్వుతో తయారు చేస్తున్న లడ్డూలను గిరిజన గర్భిణులు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా అందజేస్తున్నారు. ఒక లడ్డూ 20 గ్రాముల బరువుంటుండగా.. కిలో లడ్డూల ధర రూ.300గా నిర్ణయించారు. కిలో లడ్డూ తయారీకి 400 గ్రాముల ఇప్పపువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 190 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి తయారు చేస్తారు. లడ్డూల తయారీ కోసం ముందుగా ఇప్పపువ్వును సేకరిస్తారు. సేకరించిన ఇప్పపువ్వును ఆరుబయట ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తారు. వేయించిన నువ్వులు, పల్లీలను దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కూడా కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు కిస్మస్, యాలకులు, మిరియాలపొడి కలిపి ఉండలుగా చుట్టి లడ్డూలు తయారు చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్ లో ఆదివాసి ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భీంబాయి ఆదివాసీ మహిళ సహకార సంఘం అధ్వర్యంలో ఈ లడ్డూ కేంద్రాన్ని 12 మంది ఆదివాసీ మహిళలు కలిసి నడిపిస్తున్నారు. టీం లీడర్ గా కుమ్ర భాగుబాయి దీన్ని ముందుకూ తీసుకెళ్తున్నారు. గత ఐదేళ్ల కిందట అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఈ లడ్డూ కేంద్రానికీ సహకారం అందించారు. దీంతో ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిని పొందుతూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి మహిళలలు నెలకొంటున్న రక్త హీనత సమస్యను సైతం దూరం చేస్తున్నారు. ఇప్పపువ్వు ఈ వేసవిలో వస్తుంది. వేసవిలో లభించే ఈ ఇప్పపువ్వులను ఆదివాసి మహిళలు వేకువజామున వెదురుబుట్టలలో సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి ఈ ఇప్ప పూలతో రక రకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు.
ఈ ఇప్పపువ్వులను లడ్డు కేంద్రానికి సైతం విక్రయిస్తూ ఆదివాసీ మహిళలు ఉపాధిని సైతం పొందుతున్నారు. ఈ లడ్డులను ఆర్డర్లు ఉన్న చోట బాక్సులలో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ లడ్డు తినడానికి ఎంతో కమ్మగా రుచికరంగా ఉంటుంది. ఈ రుచికరమైన ఇప్ప పువ్వు లడ్డులను తింటే మంచి బలం వస్తుంది, ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా మహిళలకు ఉన్న రక్త హీనత సమస్య బాగుపడుతుంది. ఈ లడ్డూ తింటే రక్తం వృద్ది చెందుతుంది. ఆదివాసీ మహిళల స్వయం కృషిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు అవార్డులను సైతం అందించారు. 2023లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆది మహోత్సవ్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కార్యక్రమంలో.. స్కిల్ డెవలప్మెంట్.. ఇక్రిశాట్, జిల్లా కలెక్టర్ ఐటిడిఎ పిఓలు అవార్డులను అందజేశారు.
ఇదే విషయాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా ప్రదాని నరేంద్ర మోదీ ఇప్పపువ్వు లడ్డూపై ప్రశంసలు కురిపించారు. ఇటివలే రాష్ట్ర ప్రభుత్వం తరఫున జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి ఇప్పపువ్వు లడ్డు వంటకాల తయారీ గురించి అక్కడి ప్రజలకు అవగాహన కలిగించారు భీంబాయి సంఘం సభ్యులు. ఇప్పపువ్వులతో శరీరానికి ఎంతో మేలని, ఈ లడ్డు తినడం వల్ల కండరాలు బలంగా ఉండడంతో పాటు మోకాళ్ళ నొప్పులు రక్తహీనత మొదలైన వ్యాధులను నియంత్రిస్తుందని రక్తం వృద్ధి చెందుతుందని ఇక్రిశాట్ పరిశోధనలోను వెల్లడైందని తెలిపారు.
ఆదివాసీ మహిళల కృషిని, వారు తయారుచేసిన పోషకమైన లడ్డూలను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. ఇది వారి స్వయం ఉపాధికి ఉదాహరణ మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఈ గిరిజన మహిళల విజయగాథ స్థానిక వనరులను ఉపయోగించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను ఎలా సృష్టించవచ్చో, సమాజంలో సానుకూల మార్పును ఎలా తీసుకురావచ్చో చూపిస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..