
ఏపీ పోలీసు అధికారులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం టీడీపీ పాలన కొనసాగదని.. చంద్రబాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామన్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తామంటూ ఫైర్ అయ్యారు. కాగా టీడీపీ నాయకుల అరాచకాలతో ఏపీలో బిహార్ లాంటి పరిస్థితులు ఏర్పాడ్డాయని విమర్శించారు వైయస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల ఉపన్నికలలో వైసీపీ కార్యకర్త లింగమయ్యను టీడీపీ గుండాలు చంపేయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన చేస్తూ శాంతి భద్రతలను సీఎం చంద్రబాబు ఎందుకు గాలికొదిలేశారని ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమన్నారు.
లింగమయ్య హత్య కేసులో పోలీసులే తప్పుడు సాక్షులను తీసుకొచ్చి కేసును నీరు గారుస్తున్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభధ్రలు దిగజారిపోయాయని.. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమైందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని పదవులు తమకే కావాలన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు జగన్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా పోటీ చేసి టీడీపీ దౌన్జన్యాలు చేసినప్పటికీ వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిందన్నారు. వైసీపీ గెలిచిన చోట చంద్రబాబు పోలీసులతో భయపెట్టి రాజకీయం చేస్తున్నారని జగన్ అన్నారు