
బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. పది గ్రాముల పసిడి త్వరలో లక్షా పాతికకు వెళ్తుందని అంచనా. బంగారం ధర ఆకాశాన్నంటుండటంతో మధ్యతరగతి ప్రజలు బంగారు వైపు చూసేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా బంగారు వస్తువులు చేయించుకోవడానికి గోల్డ్ స్మిత్ వర్కర్స్ దగ్గరికి రావడం మానేశారు. దీంతో ఉన్న వ్యాపారం పోయి గోల్డ్ స్మిత్ వర్కర్లు డీలాపడ్డారు. ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు స్వర్ణకారులు.
స్వర్ణకారులు సాధారణంగా బంగారం, వెండి తోపాటు ప్లాటినం వంటి లోహాలను ఉపయోగించి ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులను డిజైన్ చేయడం, క్రాఫ్టింగ్ చేయడం, మరమ్మతు చేయడం, సవరించడం వంటి పనులను చేపడతారు. ఒక బంగారు వస్తువు తయారు చేయాలన్నా.. వస్తువు రీప్లేస్మెంట్ చేయాలన్న చాలా నిశిత దృష్టి అవసరం. అలాంటి స్వర్ణకారుడు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మెయిన్ రోడ్ లో 700కి పైగా బంగారు షాపులు ఉన్నాయి. ఇందులో వందలాది మంది స్వర్ణకారులు పనులు చేసుకుంటున్నారు.
తాజాగా పెరిగిన బంగారం ధరలతో బంగారం కొనుగోలు చేయలేక మధ్యతరగతి వారు కూడా కనీసం షాపులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే మమ్మలను ఆదుకోవాలని కోరుతున్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ప్రజలు బంగారు ఆభరణాలు తయారు చేయడానికి తమ వద్దకు రాక పనులు లేక స్వర్ణకారులు షాపులు వెలవెలబోతున్నాయి. స్వర్ణకారుల షాపుల వద్ద పనులు లేక కొన్ని షాపులు మూసేస్తే మరికొన్ని షాపుల వద్ద ఖాళీగా పనిలేక నిరాశతో ఉన్నారు.
బంగారు ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే ప్రజలు మునుపటి కంటే తక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. తత్ఫలితంగా, స్వర్ణకారులు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి అంటున్నారు. చాలా మంది చేతి వృత్తులవారి జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ స్వర్ణకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో స్వర్ణకారులకు లోన్లు రాక.. ఇటు పనులు లేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని వాపోతున్నారు. బంగారం ధర పెరుగుదలతోపాటు.. పెద్ద పెద్ద లగ్జరీష్ బంగారం షాపులు వచ్చేయడంతో పనులు బాగా తగ్గిపోయిని వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని ఏదైనా భృతి ప్రకటించాలని కోరుతున్నారు రాజమండ్రి స్వర్ణకారులు.
తూర్పుగోదావరి జిల్లాలో ఒక రాజమండ్రిలోనే వెయ్యి మందికి పైగా స్వర్ణకారులు ఈ సాంప్రదాయ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఇక చుట్టుపక్కల స్వర్ణకారులైతే మరొక 3,000 నుంచి 4,000 మంది వరకు ఉంటారు. పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాలో దాదాపు వేలాది మంది స్వర్ణకారులు పరిస్థితి ఇలాగే ఉందని అంటున్నారు. ఆభరణాల తయారీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రావడంతో ఈ వృత్తికి ప్రాధాన్యత తగ్గడం.. మరోవైపు బంగారు ఆభరణాలు రేటు అధికమవడం.. వెరసి సామాన్య స్వర్ణకారుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..