
ఇంట్లోని ప్రతి గది ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటిలో పూజ గది అనేది అత్యంత పవిత్రమైన స్థలం. ఇది దేవుని దర్శనం కోసం మాత్రమే కాకుండా ఇంట్లో శుభశక్తిని ఆకర్షించే పవిత్ర స్థలంగా గుర్తించబడుతుంది. అలాంటి గదిలో ఎలాంటి వస్తువులు ఉండాలి, ఉండకూడదన్న దానిపై వాస్తు శాస్త్రంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్గిపెట్టె వంటి వస్తువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వాస్తు శాస్త్రం ప్రకారం అగ్గిపెట్టెను పూజ గదిలో ఉంచడం అనేది ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చని నిపుణులు చెబుతారు. అగ్గిపెట్టె అంటే నిప్పు. నిప్పు ఒక వైపు శక్తి, ఆరాధనకు ఉపయోగపడుతుంది. కానీ అదే నిప్పు నియంత్రణ లేకపోతే ధ్వంసానికి కారణమవుతుంది. పూజ గది శాంతియుతమైన, ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉండే ప్రదేశం. అలాంటి చోట అగ్గిపెట్టె ఉంచడం వల్ల ఆ శక్తుల్లో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి బలహీనపడుతుంది. దీని ప్రభావంగా కొన్ని ఇంట్లో మానసిక శాంతి లోపించటం, ఆర్థిక సమస్యలు రావడం, కుటుంబసభ్యుల మధ్య మాటల తేడాలు, మనస్పర్థలు పెరగడం వంటి ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశముంటుంది. వాస్తు నిపుణుల అనుసారం ఇది శక్తుల అసమతుల్యతకు సంకేతంగా చెప్పబడుతుంది.
అగ్గిపెట్టెను వంటగదిలో ఉంచడం ఉత్తమ ఎంపిక. ఎందుకంటే వంటగది అనేది నిప్పు వాడే స్థలం. అక్కడ అగ్గిపెట్టె అవసరమైన వస్తువుగా ఉంటుంది. ఇది వాస్తు పరంగానూ సరైనదే. వంటగదిలో ఉన్నప్పుడు ఇది ఆశీర్వాదంగా మారుతుందని నిపుణుల అభిప్రాయం.
ఏదైనా అత్యవసరంగా పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచాల్సిన పరిస్థితి వస్తే.. దానిని కేవలం ఓ బట్టలో చుట్టి దృష్టికి కనిపించకుండా పెట్టాలి. ఇది నిర్లక్ష్యంగా కాకుండా చక్కటి శుభ్రతతో ఉంచడం వల్ల దాని ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పూజ గదిలో దక్షిణ దిశలో పెట్టకూడదు. ఉత్తర లేదా తూర్పు దిశల్లో మాత్రమే ఉంచితే మంచిదని వాస్తు చెబుతుంది.
దీపం వెలిగించిన తర్వాత వాడిన అగ్గిపుల్లను అలాగే వదిలేయడం దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ చర్య వల్ల ఇంట్లో దోషాలు ఏర్పడతాయంటూ వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి చిన్న విషయాలే ఇంట్లో పెద్ద ఇబ్బందులకు దారి తీసే అవకాశాలు కలిగి ఉంటాయి. అందువల్ల దీన్ని శుభ్రంగా తీసేయడం శ్రేయస్కరం.
పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచాలి. ప్రతి రోజు దీపం వెలిగించి మంత్రాలను పఠించడం వల్ల ఆ గదిలో సానుకూల శక్తి నిలిచిపోతుంది. సుగంధ ద్రవ్యాలు, అగరబత్తీలు వాడడం వల్ల గది పవిత్రత పెరుగుతుంది. ఇలా చేస్తే ఇంట్లో శాంతి, అభివృద్ధి, ఆనందం నిలకడగా ఉంటాయి.