
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు తలనొప్పి, కడుపు నొప్పి, అలసట, ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ అసౌకర్యాలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా సహజంగా లభించే కొన్ని ఫలాలు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ ఈ రోజుల్లో శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
నెలసరి నొప్పి సమయంలో శరీరానికి శాంతిని కలిగించే ప్రాకృతిక మార్గాల్లో డార్క్ చాక్లెట్ ఒకటి. ఇందులో మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల కండరాల నొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ అయిన సిరొటొనిన్ను విడుదల చేసేలా చేస్తుంది. దీని ప్రభావంతో మన మనసు కొంత హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది.
నెలసరి సమయంలో కొంతమందికి గ్యాస్ సమస్య లేదా కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో పుదీనా ఆకులతో చేసిన టీ లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
బీట్రూట్లో ఉండే ఐరన్, ఫోలేట్, విటమిన్ సి వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరచి నెలసరి సమయంలో ఎక్కువగా వచ్చే బలహీనత, కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ను సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
కిస్మిస్లో సహజ చక్కెరలు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ అలసటను తగ్గిస్తాయి. అలాగే పీరియడ్స్ నొప్పి మానడం కూడా వీటివల్ల సాధ్యపడుతుంది. రోజు ఉదయాన్నే కొద్దిగా నానబెట్టి తినడం మంచిది.
నెలసరి సమయంలో వచ్చే కడుపు ఉబ్బరం.. డైజెస్టివ్ సమస్యలకు శాంతి కలిగించే ఒక మంచి ఆహారం కీరదోస. ఇది శరీరాన్ని చల్లబరిచి, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే నీటిశాతం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీనిని పచ్చిమిర్చి లేకుండా తినడం మంచిది.
విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ పండు ఈ సమయంలో శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి సహజమైన ఎనర్జీ ఇచ్చే ఫలంగా పరిగణించబడుతుంది. ఆరెంజ్ తో పాటు మోసంబి వంటి పండ్లను కూడా ఆహారంలో చేర్చితే శరీరం తాజాగా అనిపిస్తుంది.
నెలసరి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మందులకంటే సహజమైన ఆహారంతో ఉపశమనం పొందడం మంచిది. పైగా ఈ ఆహారాలు పుష్కలంగా పోషకాలు కలిగి ఉండటంతో పీరియడ్స్ టైంలో మాత్రమే కాకుండా ఇతర సమయాల్లో కూడా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే తీవ్ర నొప్పి ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.