
పహల్గామ్ దాడి అటాక్ వెనుక టెర్రరిస్టుల మోటివ్ ఏంటి..? ఆర్టికల్ 370రద్దుకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమమా..? అంటే అవుననే సమాధనం వస్తోంది. ఇది ఇప్పటికప్పుడు జరిగిన దాడి కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి రెక్కి నిర్వహించి.. డెత్‌స్పాట్‌ను డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకూ భద్రతా బలగాల కన్నుకప్పి బైసరన్ వ్యాలీలోకి ఉగ్రవాదులు ముందుగా ఎలా వెళ్లారు..? ఎన్నిరోజుల నుంచి అక్కడ మకాం పెట్టారు..?
పహల్గామ్ దాడి.. ఏదో అషామాషీగా జరిగిన అటాక్ అయితే కాదు. దీనివెనుక పక్కా ప్రొఫెషనల్ స్కెచ్ ఉన్నట్లు దాడి జరిగిన తీరు చూస్తే స్పష్టమవుతోంది. మంగళవారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో.. పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ, పర్యాటకులతో కిటకిటలాడుతోంది. కొందరు గుర్రాలపై సవారీ చేస్తుంటే, మరికొందరు పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సమయం. అకస్మాత్తుగా, సైనిక యూనిఫాంలలో ఉన్న ఆరుగురు ఉగ్రవాదులు దట్టమైన అడవుల నుంచి ప్రత్యక్షమయ్యారు. అయితే ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. సైనికుల్లా వ్యవహరిస్తూ.. అక్కడున్న పర్యాటకుల మతం, పేరును విచారిస్తూ వచ్చారు. కొందరు ఇస్లామిక్ కల్మా చదవమన్నారు. ఆ తర్వాత ఓ వర్గం టార్గెట్‌గా AK-47 రైఫిళ్లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. క్షణాల్లో ఆ పచ్చని లోయ రక్తసిక్తమైంది.
ఉగ్రవాదులు ఎంతగా పర్యాటకులను భయపెట్టారంటే.. నిజమైన భారత ఆర్మీని చూసినా ప్రజలు గజగజవణికిపోయేంతలా..! ఉగ్రదాడులు సమాచారం అందగానే భారత్ ఆర్మీ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుంది. అయితే పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న మహిళలు, పిల్లలు సైనికులను కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారని వణికిపోయారు. సైనికులను చూసిన ఓ మహిళ తన పిల్లలను ఏమీ చేయవద్దంటూ చేతుల జోడించి వేడుకుంది. ఇతర పర్యాటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచేందుకు ప్రయత్నించారు. అయితే ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ.. తాము భారత ఆర్మీగా పరిచయం చేసుకుంటూ..మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికి వచ్చామని భరోసా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
బైసరన్ వ్యాలీ.. ఇది ఎత్తైన కొండప్రాంతం. ఇక్కడకు వెళ్లాలంటే జీపులు, బైకులు లాంటివి పనిచేయవు. పహల్గామ్ బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే.. ఈవ్యాలీకి కాలినడకన కానీ గుర్రంపై కానీ చేరుకోగలరు. ఇదే ఉగ్రవాదులకు అవకాశంగా మారింది. ఈప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అంతేకాదు ముందుగా రెక్కీ కూడా నిర్వహించారని అనుమానిస్తున్నారు.
ఎందుకంటే దాడి సమయంలో ఉగ్రవాదుల వ్యూహం, సైనిక యూనిఫాంలు, పర్యాటకులను గుర్తించే విధానం, ఎక్కడి నుంచి బయటకు రావాలి, ఎలా దాడి చేయాలి, ఇవన్ని ఉగ్రవాదుల పక్కా ప్రణాళికగా అటాక్ చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చినవారిగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరో ఇద్దరు స్థానికులైన ఆదిల్, ఆసిఫ్ గా గుర్తించారు. అంతేకాదు ఈహత్యాకాండను టెర్రరిస్డులు బాడీ కెమెరాలతో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు బాడీ కెమెరాలను ఉపయోగించి..దాడి దృశ్యాలను రికార్డ్ చేశారని సమాచారం. ఈ వీడియోలు భవిష్యత్తులో ఉగ్రవాద సంస్థలు తమ ప్రచారం కోసం ఉపయోగించే అవకాశం ఉంది…
కశ్మీర్ అంటేనే పర్యాటకానికి స్వర్గధామం.. 2024లో 35 లక్షల మంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించారు. గత దశాబ్దకాలంగా ఉగ్రవాదం వల్ల పూర్తిగా కుంగిపోయిన పర్యాటక రంగానికి పునర్జన్మనిచ్చింది. కానీ, ఈ దాడి తర్వాత, పహల్గామ్లోని హోటళ్లు, గుర్రపు సవారీలు, స్థానిక వ్యాపారాలు ఒక్కసారిగా మూతబడ్డాయి. ఉగ్రదాడి సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశంలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సంఘటన 2000 మార్చి 20న జరిగిన చిత్తిసింగ్‌పురా ఊచకోతను గుర్తు చేస్తోంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో ఉన్న సమయంలో 36 మంది సిక్కులను అత్యంత దారుణంగా హత్య చేశారు. అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు ఈదాడికి తెగబడ్డారు.
ఇప్పుడు, జేడి వాన్స్ పర్యటన సమయంలో జరిగిన ఈ దాడి కూడా అదే మోటివ్‌తోనే జరిగిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..ఈ దాడిని ఖండింస్తూ.. భారత్‌తో కలిసి ఉగ్రవాదాన్ని ఎదిరిస్తామని ప్రకటించారు. ఇటు భారత్ కూడా ఉగ్రతండాలకు హెచ్చరికలు పంపింది. ఈదాడికి ప్రతికార చర్య తప్పక ఉంటుందని, త్వరలోనే దీనికి బాధ్యులైనవారి అంతు తేలుస్తామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, కశ్మీర్లో రాజకీయ, సామాజిక పరిస్థితులు గణనీయంగా మారాయి. 370రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది, పహల్గామ్ అటాక్ కేవలం ఒక ఉగ్రదాడిగానే కాదు…ఇది కశ్మీర్ సోల్‌పై జరిగిన దాడిగా కశ్మిర్ సమాజం చూస్తోంది. స్థానికుల జీవనోపాధిని, పర్యాటకుల భద్రతను, కశ్మీర్ శాంతిని ప్రశ్నార్థకం చేసింది. అయితే కశ్మీర్ ప్రజలు, భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదులను ఎదిరించేందుకు ఒక్కటయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..