
అప్పుడు అమెరికా అధ్యక్షుడి పర్యటన.. ఇప్పుడు ఉపాధ్యక్షుడి పర్యటన. ఉగ్రమూకలు సమయం చూసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల నేతలు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో దాడి చేస్తే.. ఘటనను అంతర్జాతీయం చేయేచ్చనే కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది
అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో జరిగిన పహల్గామ్ దాడితో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడే కాదు 2000 ఏడాదిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 2000 మార్చి 20న జరిగిన దాడిలో 36 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అనంత్‌నాగ్ జిల్లా ఛత్తీసింగ్‌పొరలో సిక్కు వర్గం లక్ష్యంగా ఉగ్రమూక దాడులకు పాల్పడింది. వాస్తవానికి ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి.. గతంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో దాడి జరిగితే అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతో నరమేధానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పైగా ఈ దాడిలో పురుషులనే టార్గెట్‌గా చేశాయి ఉగ్రమూకలు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో మంగళవారం(ఏప్రిల్ 22) ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరిగింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ ఉగ్రవాద దాడిలో 28 మంది మరణించారు. మృతులు వివిధ రాష్ట్రాలకు చెందినవారు. దాడి జరిగిన వెంటనే, భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించి, కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు పోలీసు యూనిఫాంలో వచ్చారని చెబుతున్నారు. దాడి వార్త అందిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గాంలో ఉన్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..