
పనస పండు సీజన్ మొదలైంది. ఇప్పుడు ప్రతి వీధిలో పనస పండ్లు అమ్మే స్టాల్స్ కనిపిస్తున్నాయి. దాని వాసన, రుచితో చాలా మందిని ఆకర్షిస్తుంది. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. కానీ పనస పండు తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తినడం వల్ల శరీరానికి హానికరం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పనస పండులో ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, రిబోఫ్లావిన్, థియామిన్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్, ఫైబర్, విటమిన్ బి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. పైగా పనస పండు తినడం వల్ల శరీరంలో వేడి పెరగదు. చర్మానికి కూడా ఇది మంచిది. ఇందులో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ పనస పండుతో కొన్ని ఆహారాలు కలిపి తినడం వల్ల హానికరం అవుతుంది.
పనస పండు తిన్న వెంటనే పాలు తాగడం మంచిది కాదు. లేదా ముందే పాలు తాగినపుడు వెంటనే పనస పండు తినడం మంచిది కాదు. ఇలా చేస్తే చర్మంపై దురద, గజ్జి, చర్మశోథం, సోరియాసిస్ వంటి సమస్యలు రావచ్చు. పాలు ఆధారిత పదార్థాలు కూడా పనస పండుతో కలిపి తినకూడదు. ఇది అజీర్ణం, చర్మ సమస్యలకు దారితీస్తుంది.
పనస పండు తిన్న తర్వాత తేనె తీసుకోవడం కూడా మంచిది కాదు. తేనె చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు ఇది ప్రమాదకరం. తేనెతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అస్థిరంగా మారుతుంది. ఇది శరీరాన్ని బలహీనంగా మారుస్తుంది.
ఇక బొప్పాయి కూడా పనస పండు తిన్న తర్వాత తీసుకోవడం మంచిది కాదు. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ పనస పండులోని పదార్థాలతో కలిసినప్పుడు కడుపులో రసాయన ప్రతిచర్యలు జరిగి ఆమ్లత, అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. పనస పండు, బెండకాయ రెండింటిని ఒకేసారి తినడం వల్ల శరీరంలో ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు, తెల్లటి మచ్చలు వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
పనస పండు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ దానితో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. అందుకే పై సూచించిన ఆహారాలను పనస పండు తిన్న తర్వాత తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)