
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ప్రయోజనం కలగనుంది. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ప్రభుత్వం రాయితీతో రుణాలు అందించనుంది. దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల రాయితీలు అందించనున్నట్లు తెలుస్తోంది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద మూడు క్యాటగిరీలుగా లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చనుంది. క్యాటగిరీ-1 కింద లక్ష వరకు రుణం అందిస్తుంది. అందులో 80 శాతం రాయితీ ఉంటుంది. క్యాటగిరీ-2 కింద లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అందులో 70 శాతం రాయితీ కల్పిస్తుంది. క్యాటగిరీ-3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలను పొందవచ్చు. అందులో 60 శాతం రాయితీ లభిస్తుంది. రాజీవ్ యువవికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండటంతో యువత నుంచి భారీసంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు రూ.1200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ రూ.360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది.