
ప్రతిరోజూ ఒక చెంచా నల్ల జీలకర్ర తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నల్ల జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆస్తమా, షుగర్ లాంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌ను కూడా ఇది నివారించగలదు. ఈ జిలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉండటంతో దానిని వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
నల్ల జీలకర్రలో పుష్కలంగా ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్, సోడియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి కూడా అధికంగా ఉంటాయి. నల్ల జీలకర్ర నూనెలో 17 శాతం ప్రోటీన్, 26 శాతం కార్బోహైడ్రేట్లు, 57 శాతం నూనెలు ఉంటాయి. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నల్ల జీలకర్ర తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఈ నల్ల జీలకర్ర గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది రక్తంలో చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆస్తమా వ్యాధితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో నల్ల జీలకర్ర నూనె, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. కాలుష్యం కారణంగా ఆస్తమా వ్యాధి విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఇది మంచి పరిష్కారం.
నల్ల జీలకర్ర చర్మానికి, జుట్టుకు మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెరిసే చర్మం కోసం నల్ల జీలకర్ర నూనెను నిమ్మరసంతో కలిపి ముఖానికి పూయాలి. జుట్టు రాలడం, చర్మ సమస్యలకు ఇది మంచి పరిష్కారం.
మధుమేహం వల్ల మూత్రపిండాలకు కలిగే నష్టాన్ని నివారించడంలో నల్ల జీలకర్ర సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా, సీరం క్రియేటినిన్ స్థాయిని కూడా ప్రభావితం చేయవచ్చు.
తలనొప్పితో బాధపడే వారు నల్ల జీలకర్ర నూనెను నుదిటి మీద రాసుకుంటే ఉపశమనం పొందవచ్చు. నల్ల జీలకర్రతో కీళ్ల నొప్పులు, కడుపు సమస్యలు, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు నల్ల జీలకర్రను తీసుకోవడం మంచిది కాదు. ఇది పిండానికి, పాలకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా ఈ నల్ల జీలకర్ర వాడకానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)