
జీఎస్టీ.. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏదైనా వస్తువును కొన్నా, అమ్మినా మనం జీఎస్టీ కడుతూ ఉంటాం. కానీ, మనదేశంలో దేవుడు కూడా జీఎస్టీ కడుతున్నాడనే విషయం మీకు తెలుసా? అవును దేశంలోని పలు దేవాలయాలు కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లిస్తున్నాయి. అది కూడా కొన్ని కోట్ల రుపాయాల్లో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. కేంద్ర ప్రభుత్వం ఆలయాల నుంచి జీఎస్టీ వసూలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ ఆరోపణలను తోసిపుచ్చింది, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని కౌంటరిచ్చింది. అయితే రాజకీయ పార్టీల ఈ ఆరోపణలు, ప్రత్యుత్తరాలు దేశంలో దేవాలయాల ఆదాయం, వాటిపై విధించే పన్నుల అంశాన్ని మళ్ళీ వేడెక్కించాయి.
ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఏ ఆలయం అత్యధికంగా సంపాదిస్తుంది, దేవాలయాలపై పన్నుకు సంబంధించిన నిబంధనలు ఏంటా అని చూస్తూ.. ఇండియాలో అత్యంత ధనిక ఆలయ ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం(TTD), ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.4,774 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా. ఇతర దేవాలయాల ఆదాయాల విషయానికొస్తే, వైష్ణో దేవి ఆలయం 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 683 కోట్ల రెండవ స్థానంలో ఉంది. తరువాత కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఆదాయం రూ. 700 కోట్లు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, దేవాలయాలపై పన్ను నిబంధనల ప్రకారం, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎటువంటి పన్ను లేదు, కానీ వాణిజ్య కార్యకలాపాలపై పన్ను విధిస్తారు. టీటీడీ 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.17.7 కోట్లు, 2024లో రూ.32.95 కోట్లు జీఎస్టీ చెల్లించింది.
అదే సమయంలో, పద్మనాభస్వామి ఆలయం 2017 నుంచి 2024 వరకు కలిపి మొత్తం GST రూ.1.57 కోట్లుగా నిర్ణయించబడింది. దేవాలయాల మతపరమైన ఆదాయంపై GST ఉండదు, ఇందులో విరాళాలు, మతపరమైన ఆచారాలు ఉంటాయి. అయితే, గది అద్దె రూ.1,000 దాటితే GST వర్తిస్తుంది. అదేవిధంగా, కమ్యూనిటీ హాళ్లు లేదా బహిరంగ ప్రదేశాల అద్దె రూ.10,000 దాటితే జీఎస్టీ చెల్లించాలి. దేవాలయాలు దుకాణాలను అద్దెకు తీసుకుని, వాటి నెలవారీ అద్దె రూ.10,000 కంటే తక్కువగా ఉంటే, అవి GST రహితంగా ఉంటాయి. కానీ ఆలయ ట్రస్టులు నిర్వహించే సావనీర్ దుకాణాలు, హెలికాప్టర్ సేవలు, ఇతర వ్యాపార కార్యకలాపాలు GST పరిధిలోకి వస్తాయి. ఇలాంటి వాటిపై టీటీడీ కోట్లలో ఆదాయం పొందుతోంది కనుక.. కోట్లలో జీఎస్టీ చెల్లించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.