
త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు కేబినెట్లో ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాశారు ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందని తన లేఖలో ప్రస్తావించారు జానారెడ్డి.
కేబినెట్ విస్తరణ అంశంపై ఉన్నట్టుండి జానారెడ్డి హైకమాండ్‌కు లేఖ రాయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కేబినెట్లో ప్రాతినిథ్యం లేకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అనేకసార్లు బహిరంగంగానే ప్రస్తావించారు. ఈ కోటాలో తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చోటు దక్కుతుందా ? లేదా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.
కేబినెట్లో ఆరు ఖాళీలు ఉండగా.. ప్రస్తుతం నాలుగు స్థానాలను భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నాలుగు కోసం సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి పోటీపడుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి అవకాశం ఇస్తే.. మల్ రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఉంటుందని.. అదే జరిగితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండకపోవచ్చనే టాక్ ఉంది. అయితే అనేక సామాజిక, రాజకీయ కోణాల్లో లెక్కలు వేసుకున్న తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుంది.. కాబట్టి తుది జాబితాలో ఎవరికి అవకాశం ఉంటుందో చెప్పడం కష్టమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడిందనే సమయంలో జానారెడ్డి వంటి సీనియర్ నేత లేఖ రాయడం కీలక పరిణామమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.