
సమాజంలో తప్పు చేసినవారికి న్యాయమూర్తులు శిక్ష విధిస్తారు. మరి ఆ న్యాయమూర్తే తప్పు చేస్తే? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. ఇందుక్కారణం దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో కరెన్సీ కట్టల వ్యవహారం. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం దేశంలో కొత్త చిచ్చు రాజేసింది. అదిప్పుడు న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చ తెచ్చిపెట్టింది. ఆ కరెన్సీ కట్టలు తనవి కాదంటూ జస్టిస్ వర్మ చెబుతున్నప్పటికీ.. అసలు నిజం ఏంటో తెలియాలంటే విచారణ జరిపించాల్సిందే అన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. న్యాయవ్యవస్థలో భాగమైన అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సైతం వర్మ తీరుపై సందేహాలు లేవనెత్తుతూ విచారణకు డిమాండ్ చేస్తోంది. కానీ సుప్రీంకోర్టు కొలీజియం మాత్రం తమ సహచరుడిని కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి తప్పు చేసిన న్యాయమూర్తులకు శిక్ష ఉండదా? ఆ పదవి నుంచి తొలగించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? రాజ్యాంగం, చట్టాలు ఏం చెబుతున్నాయి
జడ్జిని తొలగించాలంటే అభిశంసన ఒక్కటే మార్గం
————————-
చట్టాలను రూపొందించే ప్రజా ప్రతినిధులు తప్పు చేస్తే ప్రజలు తదుపరి ఎన్నికల్లో ఓటు ద్వారా శిక్షించే వెసులుబాటు ఉంది. లోక్పాల్, సీబీఐ, ఈడీ, ఇన్కం ట్యాక్స్ వంటి దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆలిండియా సర్వీస్ అధికారులను శిక్షించేందుకు కూడా వ్యవస్థలు ఉన్నాయి. వారిని సర్వీసు నుంచి తొలగించేందుకు ఆస్కారం ఉంది. కానీ దేశంలో సర్వోన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తులను తొలగించడానికి ఉన్న ఏకైక మార్గం అభిశంసన ఒక్కటే. అయితే ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు.
సుప్రీంకోర్టు జడ్జిలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి, పదవి నుంచి తొలగించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, హైకోర్టు జడ్జిలను తొలగించాలంటే ఆర్టికల్ 218 ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రాజ్యాంగంతో పాటు 1968 నాటి “జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్” లోనూ నిబంధనలు పొందుపరిచి ఉన్నాయి. వాటి ప్రకారం ఒక జడ్జిని తొలగించాలంటే లోక్సభలో కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేసి అభిశంసన తీర్మానానికి నోటీసులను అందజేయాల్సి ఉంటుంది. ఈ నోటీసులు అందుకున్న రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్ వాటిపై నేరుగా చర్చ జరిపేందుకు ఆస్కారం లేదు. జడ్జి ఎదుర్కొంటున్న ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి విచార జరిపించాల్సి ఉంటుంది. ఆ కమిటీ విచారణలో జడ్జిపై ఉన్న ఆరోపణలు నిజమేనని తేలితే అప్పుడు సభలో అభిశంసన తీర్మానాన్ని స్వీకరిస్తారు. తద్వారా చర్చ జరుగుతుంది. ఈ తీర్మానం పాసవ్వాలంటే సాధారణ మెజారిటీ సరిపోదు.
తీర్మానాన్ని ఎంతమంది ఆమోదించాలి?
——————–
బిల్లులు, తీర్మానాలు సాధారణ మెజారిటీతో పాసవుతాయి. అంటే సభలో ఆ సమయానికి ఉన్న సభ్యుల్లో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా సరిపోతుంది. కానీ అభిశంసన తీర్మానం విషయంలో అలా కాదు. ఇందుకోసం స్పెషల్ మెజారిటీ ఉండాల్సిందే. అంటే మొత్తం సభలోని సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ మంది తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. ఆ సంఖ్య సభలో ఆ సమయానికి ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల కంటే తక్కువ కాకుండా ఉండాలి.
ఈ సంఖ్యాబలంతో (స్పెషల్ మెజారిటీతో) లోక్సభలో పాసైన తీర్మానాన్ని రెండో సభ (రాజ్యసభ)కు పంపించాల్సి ఉంటుంది. ఆ సభలోనూ స్పెషల్ మెజారిటీతో పాస్ అయితేనే అభిశంసన తీర్మానం పాస్ అయినట్టు లెక్క. అంతటితో జడ్జిని తొలగించేసినట్టు కాదు. ఆ తీర్మానాన్ని ఆధారం చేసుకుని రాష్ట్రపతికి ప్రతిపాదిస్తే.. రాష్ట్రపతి ఉత్తర్వులతో జడ్జిని పదవి నుంచి తొలగించే ప్రక్రియ పూర్తవుతుంది. అంటే.. ఇదంతా జరగాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది.
అఖిలపక్ష భేటీ అందుకేనా?
—————
కరెన్సీ కట్టల వ్యవహారంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు పార్లమెంటులో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా మంది ఆ జడ్జిని తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో దేశంలో సరికొత్త చర్చకు తెరలేపినట్టయింది. మంగళవారం (మార్చి 25న) జరిగిన ఈ సమావేశానికి హాజరైన వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు.. తమ పార్టీ అధినేతను సంప్రదించి వైఖరి తెలియజేస్తామని చెప్పారు. దీంతో మరోసారి అఖిలపక్షాన్ని సమావేశపరచాలని రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్ నిర్ణయించారు. ఏకాభిప్రాయం లేదా మెజారిటీ పార్టీల అభిప్రాయానికి అనుగుణంగా అభిశంసనకు పార్లమెంట్ సిద్ధమవుతున్నట్టు ఈ చర్యలను బట్టి తెలుస్తోంది.