BCB Suspends BPL 2025-26 Indefinitely: బంగ్లాదేశ్ క్రికెట్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఒక విషాద ముగింపు దొరికింది. బోర్డు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆటగాళ్లు మ్యాచ్‌లను బహిష్కరించడంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రతిష్టాత్మక బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) 2025-26 సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించింది.
వివాదానికి దారితీసిన పరిస్థితులు: ఈ వివాదం ఒక బోర్డు డైరెక్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో మొదలైంది. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించడంతో పాటు, ఆటగాళ్ల ప్రదర్శనపై బోర్డు డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనికి నిరసనగా, ఆటగాళ్ల సంఘం (CWAB) అధ్యక్షుడు మొహమ్మద్ మిథున్ నాయకత్వంలో క్రికెటర్లందరూ ఏకమయ్యారు. సదరు డైరెక్టర్ రాజీనామా చేసే వరకు తాము బరిలోకి దిగేది లేదని భీష్మించుకోవడంతో గురువారం జరగాల్సిన బీపీఎల్ మ్యాచ్‌లు రద్దయ్యాయి.
బోర్డు ఎందుకు వాయిదా వేసింది? మైదానంలో మ్యాచ్ రిఫరీలు టాస్ కోసం వేచి చూసినా, ఆటగాళ్లు ఎవరూ మైదానంలోకి రాకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు మరియు అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆటగాళ్లతో చర్చలు విఫలమవడంతో బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
“ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్‌ను కొనసాగించడం సాధ్యం కాదు. ఆటగాళ్ల భద్రత మరియు వారి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని బీపీఎల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం” అని బీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాదంలో బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తు: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ తరుణంలో దేశంలోని ప్రధాన లీగ్ ఆగిపోవడం జట్టు సన్నద్ధతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా, అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్ట మసకబారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
