
భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తన వారసుడిగా జస్టిస్ బిఆర్ గవాయి పేరును అధికారికంగా సిఫార్సు చేశారు. ఆయన పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపారు. దీంతో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సాంప్రదాయకంగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తన వారసుడి పేరును న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది. సీనియారిటీ జాబితాలో సీజేఐ ఖన్నా తర్వాత జస్టిస్ గవాయ్ పేరు ఉంది. అందుకే జస్టిస్ ఖన్నా తన పేరును ప్రతిపాదించారు. అయితే, ఆయన పదవీకాలం 7 నెలలు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని ఆయన ప్రొఫైల్ ప్రకారం, జస్టిస్ గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పదవీ విరమణ తేదీ నవంబర్ 23, 2025. కాగా, సీనియారిటీ జాబితాలో జస్టిస్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆయనను 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశం ఉంది.
జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో స్వతంత్ర ప్రాక్టీసు ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాజీ అడ్వకేట్ జనరల్, హైకోర్టు న్యాయమూర్తి దివంగత రాజా ఎస్ భోసలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆగస్టు 1992 నుండి జూలై 1993 వరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న, ఆయన బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
జస్టిస్ గవాయ్ దేశంలో రెండవ దళిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. అంతకుముందు, జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ బాలకృష్ణన్ 2007 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్ గవాయ్ అనేక మైలురాయి తీర్పులలో పాల్గొన్నారు. వాటిలో మోదీ ప్రభుత్వం 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించడంతోపాటు ఎన్నికల బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..