
కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరిగేలా కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కింగ్ డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే.భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీతో ఓ సెక్షన్ ఆఫ్ హీరోలకు కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.
మరోవైపు ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా విడుదలకు ముందే ఇమాన్వి గురించి చర్చ బాగా జరుగుతుంది. ఫౌజీ హిట్టైతే.. ఇమాన్వి రేంజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం.
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెడుతున్నారు రుక్మిణి వసంత్. ఇప్పటికే కన్నడలో ఈమె స్టార్ హీరోయిన్. తాజాగా తారక్‌తో జోడీ కట్టే ఛాన్స్ రావడంతో.. రుక్మిణి వైపు అందరి చూపు వెళ్తుంది. ఈ మధ్యే నిఖిల్ హీరోగా నటించిన అపుడో ఇపుడో ఎపుడో సినిమాలో నటించారు. కానీ అది వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు.
రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్ కయాడు లోహర్. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్‌లో నటించారీమే. గ్లామర్ షోకు ఎలాంటి హద్దుల్లేవు.. దాంతో కయాడు పేరు మార్మోగిపోతుంది.
విశ్వక్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో కయాదును హీరోయిన్గా తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.