
అస్సీ ఘాట్ – Assi Ghat
ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఘాట్. అస్సీ ఘాట్ గంగ, అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది. ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రధానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గంగా నదిలో సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఘాట్‌లో ఉదయం చేసే హారతి కూడా చాలా ప్రసిద్ధి చెందింది.
దశాశ్వమేధ ఘాట్ – Dashashwamedh Ghat
దశాశ్వమేధ ఘాట్ కాశీ (వారణాసి)లోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్.. కాశీకి వెళ్లినవారు.. ఖచ్చితంగా ఈ ఘాట్ సందర్శించాల్సిందే. ఇది గంగా హారతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ రెండు పూటలా గంగా హారతి నిర్వహిస్తారు. కాశీలో ఎక్కువగా సందడిగా ఉండే ఘాట్లలో ఇది కూడా ఒకటి.
హరిశ్చంద్ర ఘాట్ – Harishchandra Ghat
హరిశ్చంద్ర ఘాట్ అనేది రాజా హరిశ్చంద్ర రాజు విశ్వామిత్రుడి పరీక్ష సత్యం, దాతృత్యం కోసం ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన చోటు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఘాట్లలో ఇది ఒకటి.
కేదార్ ఘాట్ – Kedar Ghat
కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న కేదారేశ్వర్ ఆలయం పేరు మీదుగా ఈ ఘాట్‌కు ఆ పేరు వచ్చింది.
మణికర్ణికా ఘాట్ – Manikarnika Ghat
మణికర్ణికా ఘాట్ పురాతనం, పవిత్రమైన ఘాట్లలో ఒకటి. గంగా నది ఒడ్డున ఉన్న మణికర్ణికా ఘాట్‌ను దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పౌరాణిక కథల ప్రకారం, పార్వతి దేవి శివునితో నృత్యం చేస్తున్న సమయంలో ఆమె చెవిపోగు (మణికర్ణిక) ఇక్కడే పడిందని, అందుకే ఈ ఘాట్‌కు మణికర్ణిక అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ శ్మశానంలోని బూడిదతో శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు.
సింధియా ఘాట్ – Scindia Ghat
సింధియా ఘాట్ సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. సింధియా ఘాట్‌లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు.
తులసి ఘాట్ – Tulsi Ghat
తులసి ఘాట్‌కి రామచరితమానస్‌ను రచించిన కవి తులసీదాస్ పేరు మీద ఈ ఘాట్ ఉంది. ఇది పాలరాతితో నిర్మితమైన ఆధునిక మందిరం. రామాయణాన్ని తులసీదాస్ ఇక్కడే రచించాడని అంటారు. ఇది 1964లో తెల్లని పాలరాతితో నిర్మించారు. రామచరిత్మానస్ శ్లోకాలు, దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.