
ప్రతి భారతీయ పౌరుడి గుండెను గర్వంగా ఉప్పొంగే రెండు ముఖ్యమైన రోజులు ఇవి. ఒకటి ఆగస్టు 15, రెండవది జనవరి 26. ఆగస్టు 15న మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రెండు రోజులు త్రివర్ణ పతాకానికి సంబంధించి ప్రత్యేకమైన పద్ధతులు, ఆచారాలను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండు పండుగలలో జెండా ఎగరవేసే విధానం, జెండా ఆవిష్కరణ మధ్య ఉండే తేడా చాలా మందికి తెలియదు. ఆ తేడాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం
1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన రోజుగా ఈ రోజుని పురస్కరించుకుంటాం. ఈ రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. త్రివర్ణ పతాకం ఎగరవేసే విధానానికి వస్తే.. జెండా స్తంభం దిగువ భాగంలో కడతారు. ఈ పతాకాన్ని పైకి లాగి ఆపై రెపరెపలాడించడం ద్వారా భారతదేశం స్వతంత్రమైందన్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఇది బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేసే ప్రత్యేక పద్ధతి.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జెండా ఆవిష్కరణ విధానానికి వస్తే.. జెండాను స్తంభం పైభాగంలో ముందుగానే కడతారు. ఆపై ఆవిష్కరించబడుతుంది. ఇది దేశం ఇప్పటికే స్వతంత్ర దేశమని తెలియజేసే పద్ధతి.
తేడాలు ఏమిటి..?
ఎగరవేసే వ్యక్తి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.
కార్యక్రమ స్థలం
ఆగస్టు 15న ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు జరుగుతాయి. జనవరి 26న రాజ్‌పథ్ వద్ద జెండా ఆవిష్కరణ జరుగుతుంది.
జెండా ఎగరవేయుట, ఆవిష్కరణ
ఆగస్టు 15న జెండాను స్తంభం దిగువన కట్టి, పైకి లాగి ఎగురవేస్తారు. జనవరి 26న జెండాను ముందుగానే స్తంభం పైభాగంలో కట్టి ఉంచి, ఆపై ఆవిష్కరించబడుతుంది.
ఈ తేడాల వెనుక అంతర్భావం
1947లో స్వాతంత్రం వచ్చినప్పటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. ఆ కాలంలో రాజ్యాంగాధికారి అయిన రాష్ట్రపతి పదవి లేకపోవడంతో ఆగస్టు 15 నాడు ప్రధాని జెండా ఎగురవేశారు. కానీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో, గణతంత్ర దినోత్సవానికి రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా మారింది.
జెండా పండుగపై అవగాహన
త్రివర్ణ పతాకం మన సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీక. పతాకానికి సంబంధించిన ఈ తేడాలు ప్రతి భారతీయ పౌరుడికి తెలియడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా విద్యార్థులకు జాతీయ పండుగల స్ఫూర్తి తెలియజేయాల్సి ఉంటుంది. జెండా రెపరెపలాడుతున్న ప్రతి సారి, దేశభక్తి గర్వాన్ని మన గుండెల్లో నిలుపుకుందాం. జై హింద్..!