

నడక అనేది ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అయితే చెప్పులు లేకుండా నడవడం మంచిదా..? లేక బూట్లు ధరించడం అవసరమా..? అని చాలా మంది ఆలోచిస్తారు. కొందరికి చెప్పులు లేకుండా నడవడం సౌకర్యవంతంగా ఉంటుంది. మరికొందరికి బూట్లు ధరించడం అవసరమని భావిస్తారు. ఈ విషయంలో సరైన సమాధానం ఒకటే ఉండదు. అది ప్రతి వ్యక్తి పరిస్థితిని బట్టి ఉంటుంది.
చెప్పులు లేకుండా నడవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు పాదాల కండరాలు సహజంగా కదులుతాయి. ఇది కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. మన పాదాల్లో ఉండే నరాలు మెదడుకు కీలకమైన సమాచారాన్ని పంపిస్తాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ నరాలు సక్రియంగా మారి సమతుల్యతను మెరుగుపరుస్తాయి. నడక క్రమంలో తుంటి, మోకాళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
చెప్పులు లేకుండా నడవడం మంచిదే అయినప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉండొచ్చు. కఠినమైన ఉపరితలాలపై వేడి, పదునైన వస్తువులపై నడవడం వల్ల గాయాలు జరుగవచ్చు. అలాగే ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. శరీరం అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు. మొదట్లో నొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు.
బూట్లు పాదాలను రక్షించడం కోసం తయారయ్యాయి. ఇవి పాదాలను పదునైన వస్తువులు, వేడి ఉపరితలాలు నుండి కాపాడుతాయి. బూట్లలో ఉన్న ఆర్చ్ సపోర్ట్, కుషనింగ్, షాక్ అబ్జార్ప్షన్ కీళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తాయి. కఠినమైన ఉపరితలాలపై నడుస్తున్నప్పుడు ఇవి మంచి రక్షణ ఇస్తాయి. అలాగే బూట్లు పాదాలకు మురికిని, బ్యాక్టీరియాలను చేరకుండా ఆపుతాయి.
బూట్లు ఉపయోగించడం మంచిదే అయినప్పటికీ వాటి వల్ల పాదాల కండరాలు బలహీనపడతాయి. ఎక్కువ సేపు బూట్లు ధరించడం వల్ల కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరిగ్గా సరిపోని బూట్లు, హై హీల్స్ వంటి వాటి వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి గాయాలు కలగవచ్చు.
ఇది మీ నడక పరిస్థితులకు, పాదాల ఆరోగ్యానికి ఆధారపడి ఉంటుంది. మృదువైన ఉపరితలాలపై చెప్పులు లేకుండా నడవడం పాదాల ఆరోగ్యానికి మంచిది. కఠినమైన లేదా ప్రమాదకరమైన ఉపరితలాలపై బూట్లు ఉపయోగించడం అవసరం. కాబట్టి రెండు నడక రకాల మధ్య సమతుల్యత కలిగి ఉండటం ఉత్తమం.