
టీ ట్రీ ఆయిల్లో శక్తివంతమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి తల చర్మంపై ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడతాయి. కానీ ఈ ఆయిల్‌ను నేరుగా ఉపయోగించడం కంటే కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల ట్రీట్రీ ఆయిల్ కలిపి అప్లై చేయడం ఉత్తమం. ఈ మిశ్రమాన్ని తలకు మర్దన చేసి అరగంట పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్ సహజమైన ఆమ్లగుణాలను కలిగి ఉంటుంది. ఇది స్కాల్ఫ్‌లోని పిహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా చుండ్రు పెరగకుండా అడ్డుకుంటుంది. ఒక భాగం ఆపిల్ వెనిగర్‌ను రెండు భాగాల నీటిలో కలిపి తలకు స్ప్రేలా వాడాలి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా తలస్నానం చేయాలి.
కొబ్బరి నూనె తల చర్మానికి తేమనిస్తుంది. ఇది పొడి స్కాల్ఫ్‌ను మృదువుగా చేసి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి తలకు మర్దన చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈ నూనెలో ట్రీట్రీ ఆయిల్ కలిపి వాడితే ఫలితం రెట్టింపు అవుతుంది.
అలోవెరాలో సహజ మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది స్కాల్ఫ్‌ను తేమగా ఉంచి పొడిబారకుండా చేస్తుంది. కలబంద గుజ్జును నేరుగా తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగితే చుండ్రు తగ్గే అవకాశం ఉంది. ఇది చర్మం మీద ఎలాంటి దుష్ప్రభావం చూపకుండా చుండ్రు నియంత్రణలో సహాయపడుతుంది.
వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చిన తర్వాత తలకు రాసి అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనబడుతుంది.
పెరుగులో సహజ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి తల చర్మానికి సహజ సమతుల్యతను ఇస్తాయి. పెరుగును నేరుగా తల మీద రాసి 20-30 నిమిషాల తర్వాత తల కడిగితే చుండ్రు తగ్గుతుంది. ఇది తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది, తేమను అందిస్తుంది. ఈ విధంగా ఇంట్లోనే అందుబాటులో ఉండే సహజ పదార్థాలతో చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)