
బుల్ పరుగు పెడితే.. గోల్డ్ మెరుపు కంటిన్యూ అయింది. చాలా రోజుల తర్వాత.. దేశీయ స్టాక్ మార్కెట్లు కళకళలాడాయి. సెన్సెక్స్ 1131.. నిఫ్టీ 325 పాయింట్లు లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లో సానుకూల పవనాలతో పాటు ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో బంగారం ధర రన్ రాజా రన్ అంటూ ఎగబాకడం సామాన్యుడిని కలవరపెడుతోంది.
చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఎండ్ వరకు అదే బాటలో పయనించాయి. వరుసగా నష్టాలు చవిచూసిన మార్కెట్ సూచీలు కనిష్టాల దగ్గర ఇన్వెస్టర్లు కొనుగోలుకి దిగడంతో వరుసగా రెండో రోజు సూచీలు పరుగు పెట్టాయి. సెన్సెక్స్ 1,131 పాయింట్లు పెరిగి.. 75 వేల 301 దగ్గర ముగిసింది. నిఫ్టీ 325 పాయింట్లు పెరిగి 22,834 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 960 పాయింట్లు పెరిగి 49,314 దగ్గర లాభాలతో ముగిసింది. సూచీలో జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఉత్తమ్ షుగర్ మిల్స్, వన్ మొబిక్విక్ సిస్టమ్, టీటీ , సింధు ట్రేడ్స్ లింక్స్, మెడికో రెమెడిస్ లాంటి కంపెనీలు నష్టాలు చవిచూశాయి.
ఆసియా మార్కెట్లలో ర్యాలీ కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలతో చాలా కాలంగా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. వరుస నష్టాల క్రమంలో చాలా కంపెనీల స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయన్న మార్కెట్ ఎనలిస్ట్‌ల అభిప్రాయాలు మార్కెట్‌కు కలిసొచ్చింది. భారత వాణిజ్యలోటు మూడున్నర ఏళ్ల కనిష్ఠానికి దిగడం మార్కెట్‌కు సెంటిమెంట్‌ను బలపరిచింది. 2025 ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీడీపీ వృద్ధి 6.2 శాతంగా నమోదు కావడం.. పారిశ్రామిక ఉత్పత్తిలో 5.1 శాతం పెరుగుదల.. స్థూల పన్ను వసూళ్లలో 16శాతం పెరుగుదల.. రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి తగ్గడం కూడా మార్కెట్ ర్యాలీకి కారణమైంది. నిన్న అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా క్లోజ్ కావడం మరో కారణంగా కనిపించింది. ఇక అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో చైనా ప్రోత్సాహక చర్యలు చేపట్టింది. దీంతో ఆ దేశం నుంచి మెటల్‌కు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఆ రంగం స్టాక్స్ లాభపడ్డాయి.
ఈక్విటీ మార్కెట్ ఐదు రోజుల నష్టాలకు తెరదించింది. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన ర్యాలీకి తోడు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్‌ను లాభాల్లో నిలిపింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 49వేల మార్క్‌ను దాటింది. దేశీయ మార్కెట్లు కళకళలాడినా.. స్టాక్స్ కొనేందుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మార్కెట్ మళ్లీ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. పసిడి ధర ఆగనంటూ పరుగు పెడుతూనే ఉంది. దాని స్పీడ్‌కి కొనాలంటే భయపడే పరిస్థితి. ఇది కేవలం లోహం మాత్రమే కాదూ.. సంపదకు చిహ్నం.. శుభానికి సూచిక.. అన్నింటికీ మించి పెట్టుబడికి భరోసా. అందుకే బంగారం ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుల గుండెల్లో దడ పుడుతుంది. ఇవాళ కూడా ఇంచుమించు అదే పని చేసింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 93 వేల 906 రూపాయలకు చేరింది. నిన్నటితో పోలిస్తే 435 రూపాయలు పెరిగింది.
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెల్లరీ మార్కెట్ ట్రెండ్స్ లాంటి అంశాలు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే.. సహజంగానే దేశీయ మార్కెట్లోనూ పెరుగుతాయి. పండుగలు, శుభకార్యాలు దగ్గర పడుతున్న వేళ గోల్డ్ ధరలు పెరుగుతూ పోవడంతో కలవరపెడుతోంది. కనకం రేట్ స్పీడ్ చూస్తుంటే.. త్వరలోనే లక్షమార్క్‌ను టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే సామాన్యుడు బంగారం కొనడం అసాధ్యమే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..