
టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి 2025 సంవత్సరంలో కొన్ని పెను ప్రమాదాలను మానవాళి ఎదుర్కోనుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెలలు, తేదీలతో పాటు ఆ రోజు ఏం జరుగుతుందనే విషయాలను స్పష్టంగా చెప్తున్నాడు. ఇతడు చెప్తున్న వాటిలో అమెరికా అంతర్యుద్ధం, ప్రపంచాన్ని వణికించే సుడిగాలుల వంటి అంశాలున్నాయి. అంతేకాదు, గ్రహాంతర వాసుల ఆగమనం.. ఆతర్వాత భూమిమీద జరగబోయే పరిస్థితులను కూడా అంచనా వేసి చెప్తున్నాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూసి పలువురు భయభ్రాంతులకు గురవుతుంటే మరొకొందరు నెటిజన్లు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తనను తాను థాంప్సన్ గా పరిచయం చేసుకున్న ఈ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. ఇతడి పేరు మీద ఉన్న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి మాత్రం 70 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఔషధ మూలికలతో రోగాలు నయం చేసే మరో వ్యాపకం కూడా అతడికి ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అతడేం ప్రెడిక్ట్ చేస్తున్నాడో మీరూ తెలుసుకోండి..
అతడు చెప్తున్న భయంకర విషయాలివే..
ఎల్విస్ థాంప్సన్ జనవరి 1న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు అందులో ప్రపంచంలోని ఐదు వేరు వేరు ప్రదేశాల్లో పలు తేదీలలో పెద్ద విపత్కర సంఘటనలు జరుగుతాయని అతను చెప్తున్నాడు. అప్పటి నుండి అతని వాదనలు వైరల్ అయ్యాయి. ఇతడి వీడియోలకు లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అతని అంచనాలను పరిశీలిస్తే..
2025 ఏప్రిల్ 6న..
ఒక్లహోమాలో వినాశకరమైన సుడిగాలి వస్తుంది. ఈ వినాశనకరమైన గాలులు ఏప్రిల్ 6న, గంటకు 1,046 కిలోమీటర్ల వేగంతో 24 కిలోమీటర్ల వెడల్పుతో విరుచుకుపడతాయి. అమెరికాను అతలాకుతలం చేస్తాయి.
మే 27న..
అమెరికాలో రెండవ అంతర్యుద్ధం చెలరేగుతుందని, ఫలితంగా టెక్సాస్ విడిపోతుందని చెప్తున్నాడు. ఇది అణ్వాయుధాలతో కూడిన ప్రపంచ సంఘర్షణకు దారితీస్తుందని, చివరికి అమెరికా శిథిలావస్థలో మిగిలిపోతుందని అంచనా వేస్తున్నాడు.
సెప్టెంబర్ 1న..
ఛాంపియన్ అనే గ్రహాంతరవాసి 12,000 మంది మానవులను వారి భద్రత కోసం మరొక నివాస గ్రహానికి తీసుకువెళుతుందని థాంప్సన్ అంచనా వేశాడు. భూమికి హాని కలిగించే ఉద్దేశ్యంతో వచ్చే శత్రు గ్రహాంతరవాసుల గురించి కూడా అతను హెచ్చరించాడు.
సెప్టెంబర్ 19న..
అమెరికా తూర్పు తీరాన్ని భారీ తుఫాను ముంచెత్తుతుందని అంచనా వేశారు. చివరగా, నవంబర్ 3న, నీలి తిమింగలం కంటే ఆరు రెట్లు పెద్దది సెరీన్ క్రౌన్ అని పిలువబడే ఒక భారీ సముద్ర జీవి పసిఫిక్ మహాసముద్రంలో కనుగొనబడుతుందని ఆయన పేర్కొన్నాడు.
టైమ్ ట్రావెలర్ గా చెప్పుకుంటున్న ఈ థాంమ్సన్ వీడియోను ఇప్పటికే 26 మిలియన్ల మంది చూశారు. అందులో కొందరు ఇతడి మాటలను కొట్టి పారేస్తున్నారు. అంత భవిష్యత్తు చూసొచ్చినోడివి వచ్చే వారం గెలిచే ఓ లాటరీ టికెట్ నంబర్ తెలుసుకుని రావాల్సిందిగా అంటూ వ్యంగంగా స్పందిస్తున్నారు. నీ వీడియోలో చెప్పిన విషయాలను సేవ్ చేసుకుంటున్నాను. ఇవి జరగకపోతే నీమీద దావా వేస్తాను అంటూ మరో నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ చేశాడు. అణ్వాయుధాలను ఉపయోగిస్తే భవిష్యత్తు నుంచి నువ్వు మళ్లీ ఎలా తిరిగి రాగలిగావు అసలెవరూ బతికే అవకాశమే ఉండదు కదా అంటూ ఓ నెటిజన్ ఆరా తీశాడు. మొత్తానికి ఇతడు చెప్తున్న దాంట్లో నిజమెంతో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఇతడి పేరు మార్మోగుతోంది.