
ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. అలా అని క్యాబ్ డ్రైవర్లు అంతే మొత్తం చెల్లించడం లేదు. కస్టమర్ నుంచి తీసుకున్న ఛార్జీలో భారీగా కోత విధించి.. మిగతా డబ్బును డ్రైవర్లకు, రైడర్లకు చెల్లిస్తున్నాయి. వీటిపై డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఐడియాతో ముందుకు వచ్చింది. సహకార్ ట్యాక్సీ పేరుతో ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వెల్లడించారు.
డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవ ‘సహకార్ ట్యాక్సీని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో సహకార సంఘాలు ద్విచక్ర వాహనాలు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. “ఇది కేవలం నినాదం కాదు. దీనిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ మూడున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసింది. కొన్ని నెలల్లో, డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే విధంగా ఒక ప్రధాన సహకార ట్యాక్సీ సేవ ప్రారంభిస్తామని అని హోం మంత్రి అన్నారు.
వినియోగదారుడు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ల బుక్ చేసుకుంటున్నారా అనే దాని ఆధారంగా కూడా రైడ్ ఛార్జీలు మారుతున్నాయని నివేదికలు వెలువడిన తర్వాత సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఇటీవల రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, ఓలా ప్లాట్ఫామ్ ఆధారిత ధర వివక్షత వాదనలను తోసిపుచ్చింది. “మా కస్టమర్లందరికీ మేము ఒక విధమైన ధరలు కలిగి ఉన్నాం, సెల్ఫోన్ ఆధారంగా ధర నిర్ణయించడం లేదని వెల్లడించింది. ఉబెర్ కూడా ఈ ఆరోపణలను ఖండించింది. అయితే.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ను తీసుకురానుండటంపై ఉబర్, ఓలా, ర్యాపిడో ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.