
గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అత్యంత ముఖ్యమైనవి. నిత్యం పండ్లను సమయానుసారం తీసుకుంటే గుండెపోటు, రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు వంటి అనేక గుండె సంబంధిత సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండెను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇప్పుడు అలాంటి పండ్ల గురించి తెలుసుకుందాం.
బ్లూబెర్రీలు
బ్లూబెర్రీలు చిన్న పరిమాణంలో ఉన్నా పోషకాల పరంగా భారీ ప్రభావం చూపే పండ్లు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా యాంటోసైనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను అణిచేసి రక్తనాళాల్లో రక్తప్రసరణ సజావుగా సాగేలా సహాయపడతాయి. దీంతో గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు అడ్డుకట్ట వేయగలవు.
ఆపిల్
ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదనే మాటకు గల కారణమే ఇందులోని పోషకాల సమ్మేళనం. ఆపిల్‌లో ఉండే ఫైబర్, ప్రత్యేకించి పెక్టిన్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బుల్ని నివారిస్తుంది. అలాగే ఇది శరీరానికి శక్తినిచ్చే సహజ పండు.
దానిమ్మ
దానిమ్మ పండు కేవలం రుచికరమైనదే కాదు గుండెకు మిత్రమైన యాంటీఆక్సిడెంట్లతో కూడినదీ. ఇందులో ఉన్న పోలిఫెనాల్స్ గుండె ధమనుల్లో కొవ్వు చేరకుండా నిరోధిస్తాయి. అలాగే గుండెపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించి దాని ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
అవకాడో
అవకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అలాగే పొటాషియం అధికంగా ఉండటంతో ఇది బీపీని కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఒక సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు.
నారింజ
నారింజ అంటే మనకు తీపి రుచితో పాటు ఆరోగ్య ప్రదాయకమైన పండు. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేసి అవి కలిగించే నష్టం నుండి గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. నారింజలో ఉండే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది.
పుచ్చకాయ
ఎండాకాలంలో అధికంగా తీసుకునే పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది రక్తనాళాల్లో దృఢత్వాన్ని కలిగించడంలో, బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది హైడ్రేషన్‌ను మెరుగుపరచడం ద్వారా గుండె పనితీరును సమతుల్యం చేస్తుంది.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ A, C, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణవ్యవస్థను సమర్థంగా పనిచేసేలా చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండటంతో గుండె ఆరోగ్యంపై కూడా అనుకూల ప్రభావం చూపుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)