గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత ప్రభావవంతంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గిరిజన సంప్రదాయ వైద్యులను ప్రజారోగ్య వ్యవస్థలో భాగస్వాములుగా గుర్తిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా గిరిజన వైద్యులను అధికారికంగా ప్రజారోగ్య వ్యవస్థతో అనుసంధానించే జాతీయ ప్రయత్నంగా నిలుస్తోంది. చివరి మైలు వరకు ఆరోగ్య సేవలు చేరేలా సమాజ ఆధారిత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడిందని కేంద్రం తెలిపింది. ఈ ప్రారంభ సభకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం, రాష్ట్ర మంత్రి దుర్గదాస్ ఉయికే, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో పాటు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, AIIMS, ICMR, WHO వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 400 మంది గిరిజన సంప్రదాయ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్, గిరిజన వైద్యులు తరతరాలుగా తమ సమాజంలో సంపాదించుకున్న విశ్వాసం ప్రజారోగ్యానికి బలమైన ఆధారమని పేర్కొన్నారు. నివారణ, వ్యాధుల తొందరగానే గుర్తింపు, సరైన సమయంలో ఆసుపత్రులకు రిఫరల్ వంటి అంశాల్లో గిరిజన వైద్యుల భాగస్వామ్యం చివరి మైలు సేవలను బలోపేతం చేస్తుందని తెలిపారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి రంజనా చోప్రా మాట్లాడుతూ.. మలేరియా, క్షయ, కుష్టు వంటి అంటువ్యాధులు ఇంకా కొన్ని గిరిజన జిల్లాల్లో సవాలుగా ఉన్నాయని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన సమాజ ఆధారిత ఆరోగ్య విధానాలే స్థిరమైన పరిష్కారం అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది గిరిజన వైద్యులను అధికారికంగా గుర్తించి ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మరో కీలక పరిణామంగా ICMR–రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, భువనేశ్వర్‌తో MoU కుదిరింది. దీని ద్వారా దేశంలో తొలిసారిగా ‘భారత్ ట్రైబల్ హెల్త్ ఆబ్జర్వేటరీ’ ఏర్పాటు కానుంది. గిరిజన ప్రాంతాల ఆరోగ్య డేటా, వ్యాధులపై పరిశోధన, శాస్త్రీయ ఆధారాలతో విధానాల రూపకల్పనకు ఇది దోహదపడనుంది.
కేంద్ర మంత్రి జువల్ ఓరాం మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయ వైద్య విధానాలు తరతరాలుగా నిలిచిన భారతీయ వారసత్వమని అన్నారు. ఆధునిక వైద్యం, శాస్త్ర సాంకేతికతతో పాటు సంప్రదాయ జ్ఞానాన్ని సమన్వయం చేస్తే గిరిజన ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గిరిజన వైద్యానికి మార్కెట్ లింకేజీలు, జీవనోపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ఆరోగ్యాన్ని శాస్త్రీయ ఆధారాలతో బలోపేతం చేయడంతో పాటు, స్థానిక సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని గౌరవించే దిశగా కేంద్రం ముందుకెళ్తోందని అధికారులు స్పష్టం చేశారు.
