
మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, ఆరోగ్యానికి ప్రోటీన్ అత్యవసరం. సాధారణంగా ఎక్కువ మంది ప్రోటీన్ కోసం కోడిగుడ్లు లేదా మాంసాహారాన్ని ఆశ్రయిస్తారు. అయితే శాకాహారులకూ బలవంతులుగా మారే అనేక ఆహార ఎంపికలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని గింజలు, పప్పులు, పన్నీర్, టోఫు వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనగలు ప్రోటీన్లు పుష్కలంగా కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి మొలకలు వచ్చిన తరువాత కొద్దిగా ఉడికించి, తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, క్యారెట్ తురుము, పచ్చిమిరప తురుము, ఉప్పు, కారం, కొద్దిగా వెనిగర్ కలిపి ఒక రుచికరమైన సలాడ్ తయారు చేయవచ్చు. ఈ మిశ్రమంలో కొద్దిగా మయనైజ్ కలిపితే రుచి మరింతగా పెరుగుతుంది.
పన్నీర్ అంటేనే మంచి ప్రోటీన్ మూలం. ఇది శాకాహారుల కోసం అద్భుతమైన ఎంపిక. కూరల్లో, సలాడ్లలో, గ్రిల్డ్ వంటకాల్లో దానిని ఉపయోగించవచ్చు. రోజువారీ ఆహారంలో పన్నీర్‌ను చేర్చుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పొందవచ్చు.
బాదం గింజలతో తయారైన బటర్ కూడా పీనట్ బటర్‌కు మంచి ప్రత్యామ్నాయం. దీన్ని బ్రెడ్‌పై అప్లై చేసి తినవచ్చు లేదా స్మూతీలు, ఓట్స్‌లో కలిపి తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తూ శక్తిని అందిస్తుంది.
మన భోజనంలో పప్పులు ప్రోటీన్‌కు ప్రధాన మూలాలు. కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి వాటిలో ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు అందించగలవు.
గుమ్మడికాయ గింజలు కూడా మంచి ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్‌ను అందిస్తాయి. ప్రతి రోజు ఒక టీస్పూన్ గింజలు తీసుకుంటే శరీరానికి అవసరమైన పుష్కలమైన శక్తి లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
క్వినోవా అనే చిన్న ధాన్యంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్నం కంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది. దీనిని అన్నం మాదిరిగానే ఉడికించి కిచిడీగా చేసుకుని తినవచ్చు. ఇది గ్లూటెన్ లేకుండా ఉండే ధాన్యం కాబట్టి అజీర్తి సమస్యలున్న వారికి కూడా బాగా నప్పుతుంది.
హెంప్ సీడ్స్‌లో మంచి ప్రోటీన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని సలాడ్లు లేదా దలియాల్లో చల్లుకొని తినవచ్చు. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్.
టోఫు అనేది సోయా పప్పుతో తయారు చేసే ఒక ఆహార పదార్థం. ఇది జపాన్ దేశంలో ఎక్కువగా వాడుతారు. టోఫు బయటకు చూస్తే పనీర్‌లా కనిపిస్తుంది.. తిన్నా కూడా అలానే అనిపిస్తుంది. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని గ్రిల్ చేసి తినవచ్చు లేదా కూరలలో వేసుకొని వండవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)