
ఇంటి విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. కూతురు, కన్న తండ్రినే ఇంటి నుంచి గెంటేసింది. తనకు జరిగిన అన్యాయంలో ఆయన కోర్టుకెళ్లారు. కోర్టు విచారణ జరిపి.. తండ్రి ఇల్లు తండ్రికి ఇప్పించింది. ఆ తండ్రి తనను అన్యాయంగా రోడ్డు పాలు చేసిన కూతురిని ఇప్పుడు ఇంటిని నుంచి పంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది. సుబ్బలక్ష్మి అనే మహిళ తన తండ్రి వెంకటరోణప్పతో గొడవపడి ఇంటి నుండి గెంటేసింది. శాంతి నగర్ నివాసి అయిన వెంకటరోణప్ప వయస్సు సుమారు 72 సంవత్సరాలు. వారికి ముగ్గురు పిల్లలు. కూతురు సుబ్బలక్ష్మి కిండర్ గార్టెన్ టీచర్.
ఆమె తన తండ్రి ఆస్తి అయిన శాంతి నగర్‌లోని ఇంట్లో, తన భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. అయితే, సుబ్బులక్ష్మి తన తండ్రితో నిత్యం గొడవపడుతుండేది. ఈ క్రమంలోనే ఒక రోజు ఇంటి నుండి వెళ్ళగొట్టింది. తన కూతురి ప్రవర్తనతో విసిగిపోయిన వెంకటరోణప్ప.. సీనియర్ సిటిజన్స్ కేర్, వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, 2007 కింద చిక్కబళ్లాపూర్ సబ్-డివిజనల్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కేసును విచారించిన కోర్టు ఆ ఇంటిని వెంకటరోణప్పకు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు చెల్లించాలని కూడా ఆదేశించింది. ఆ ఉత్తర్వును అమలు చేయాలని చిక్కబళ్లాపూర్ తహశీల్దార్, పోలీసులను ఆదేశించింది.
ఈ ఆదేశాన్ని అనుసరించి, చిక్కబళ్లాపూర్ తహశీల్దార్ అనిల్ ఆ ఇంటి వద్దకు చేరుకొని సుబ్బలక్ష్మిని, ఆమె భర్తను ఇల్లు ఖాళీ చేయించి, వెంకటరోణప్పకు అప్పగించారు. తల్లిదండ్రుల కష్టంతో, చెమటా రక్తం ఏకం చేసి కట్టుకున్న ఇంట్లో పిల్లలు ఉండటం తప్పు కాదు.. కానీ, వయసు మీద పడిన వారిని అండగా నిలువగా పోగా.. వారినే ఇంటి నుంచి గెంటేస్తున్న పిల్లలకు ఇలాంటి గుణపాఠమే కరెక్ట్ అంటూ ఈ కేసు గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.