
వాస్తవానికి జెన్షో గడచిన కొన్నాళ్లుగా బాగా రాణిస్తోంది. జపాన్ వ్యాప్తంగా సుమారు రెండు వేలకు పైగా సుకియా ఔట్లెట్లు ఉన్నాయి. గత ఏడాది షేరు 25 శాతం మేర పెరిగింది. ఇటీవల పెంచిన ధరల కారణంగా కంపెనీ మరిన్ని లాభాల్లోకి వస్తుందన్న అంచనాలతో దూసుకెళ్తున్న తరుణంలో దక్షిణ జపాన్లోని టొటొరి బ్రాంచ్లో ఓ కస్టమర్ తిన్న సూప్ బౌల్లో చనిపోయిన ఎలుక అవశేషాలు బయటపడటం ఆ కంపెనీకి శాపంగా మారింది. ఈ ఘటన జనవరి 21న జరగ్గా మార్చి 22న వెలుగులోకి వచ్చింది. దీనిపై జెన్షో సంస్థ స్పందిస్తూ వండేటప్పుడు పొరపాటున జరిగిన ఈ ఘటనకు తాము చింతిస్తున్నామని ప్రకటన చేయడమే కాకుండా, ఆలస్యంగా వెల్లడించినందుకు గానూ క్షమాపణలు కూడా తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటన వెలుగు చూసిన రెండు రోజుల్లో, అంటే మార్చి 24న ఆ సంస్థ ట్రేడింగ్ సెషన్లో దాదాపు 7.1 శాతం మేర షేర్లు పతనమయ్యాయి.