
మిర్చి పేటెంట్ రైట్స్ ఓన్లీ ఓరుగల్లు రైతులకే స్వంతం..! రికార్డు ధర పలికి ప్రపంచం వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆ మిర్చి ఇప్పుడు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) సొంతం చేసుకుంది. వరంగల్ జిల్లాలో మాత్రమే సాగు జరిగే చపాట మిర్చి ప్రత్యేకత ఏంటి..? ఆ మిర్చికి భౌగోళిక గుర్తింపు ఎలా లభించింది..? వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే సాగు జరిగే ఆ మిర్చి ప్రత్యేకత ఏంటీ..? ఓరుగల్లు రైతుల వారసత్వ వ్యవసాయ ఉత్పత్తి ఎర్రబంగారం గురించి తెలుసు కోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన వస్తువుల జాబితాలో వరంగల్ చపాట మిరపకాయ చేరింది. ఇప్పటికే రికార్డుస్థాయి ధరతో దేశమంతా హాట్ హాట్ చర్చగా మారిన ఆ ఎర్ర బంగారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న పోచంపల్లి ఇక్కత్ చీరలు, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీమ్ తోపాటు మరికొన్ని వస్తువుల జాబితాలో దేశంలోనే అత్యంత తీపి మిర్చి రకంలో ఒకటైన వరంగల్ చపాట మిర్చి స్థానం సాదించుకుంది.
జీఐ ట్యాగ్ పొందిన ఓరుగల్లు మిర్చి ప్రపంచంలోనే సమ్ తింగ్ స్పెషల్ గా నిలుస్తుంది. దేశంలోనే అత్యధిక మిర్చి పంటను పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిస్తే.. మిర్చి రకాలలో అరుదైన రకంగా చపాట మిర్చి నిలిచింది. కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే సాగు జరిగే ఈ మిర్చి, సాధారణ మిర్చి కంటే పొడవు వెడల్పుగా అత్యధికంగా గింజలను కలిగి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు ఏడు వేల ఎకరాల్లో రైతులు చపాట మిర్చి సాగు చేస్తున్నారు. ఈ రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న ఈ వెరైటీ మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చపాట మిర్చిసాగుకు స్వయంగా రైతులే విత్తనోత్పత్తిని చేసుకుంటారు. పైగా పంట సాగులో కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే చపాట మిర్చిసాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా కలిసోస్తుంది. ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతోకాలంగా ఈ చపాట మిర్చి పండిస్తున్నారు. ఈ మిర్చిపై జేవీఆర్ పరిశోధనా కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి..
సింగిల్ పట్టి, లంబుకాయ, టమాట, చపాట మిర్చి తదితర పేర్లతో దీనిని పిలుస్తుంటారు. మిరప కాయలు లావుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రస్తుతం ఈ మిర్చిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ నుండి గుజరాత్, ముంబై, అహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇంగ్లండ్, అమెరికా తదితర దేశాలకు ఈ మిర్చి ఎగుమతి చేస్తున్నారు. ఆహారంలో కృత్రిమ రంగులను నిషేధించిన దేశాల్లో ఈ చపాట మిర్చికి ఎక్కువ డిమాండ్ ఉంది. కృత్రిమ ఆహార రంగులకు ప్రత్యామ్నాయంగా ఈ చపాట మిర్చిని ఉపయోగిస్తారు. ఇందులో నుంచి ఓల్యూరోసిస్ అనే ఎరుపు రంగు ద్రావణాన్ని తీసి ఫుడ్ కలర్‌గా వాడుతారు. మన దేశంలో ఎక్కువగా వీటిని పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు. వివిధ రకాల ఐస్ క్రీం రంగుల తయారీలోనూ చపాట మిర్చిని వినియోగిస్తున్నారు.
GI ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) కోసం ఈ మిర్చి పుట్టుక, అవసరమైన సాగు విధానాలు, ఈ మిరపకున్న విశిష్టమైన లక్షణాలు, ప్రయోజనాలు, డిమాండ్ తదితర అంశాలపై మహబూబాబాద్‌లోని జెన్నారెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యానవన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా అధ్యయనం చేసి ఒక సమగ్రమైన డాక్యుమెంట్‌ను రూపొందించారు. ఈ మిర్చిలోని పోషక విలువలను రాజేంద్రనగర్ లోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లో రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్ బోర్డు పరీక్ష చేసింది. జేవీఆర్ పరిశోధనా కేంద్రం చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేశాయి. రెండేళ్ల పరిశోధన అనంతరం చపాట మిర్చికి జీఐ గుర్తింపు లభించింది. మార్చి 28వ తేదీన చపాట మిర్చి GI ట్యాగ్ గుర్తింపు స్వంతం చేసుకుంది.
భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. మార్కెట్ అవకాశాలు విస్తారంగా ఉంటాయి. ఎగుమతులు కూడా అధికంగా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బంగినపల్లి మామిడి, తాండూరు కంది పప్పు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక గుర్తింపు ఉంది. అలాంటి ఉత్పత్తులను కొలిచే సాధనం స్కోవిల్లే స్కేల్ ద్వారా చపాట మిర్చిని పరీక్షించి చూశారు. మిగతా మిరపకాయల రకాలతో పోల్చి చూస్తే ఘాటు చాలా తక్కువ అని నిర్ధారణ అయింది. చపాట మిర్చి ఉష్ణ విలువ 4000-8000 మధ్య ఎస్‌హెచ్‌యూ ఉంటుంది. సాధారణ మిర్చి రకాలకు భిన్నంగా ప్రత్యేక ఆకారం, రంగు, రుచి కలిగిన చపాట మిర్చికి స్థానికంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. 2022 సంవత్సరంలో క్వింటాల్ 96 వేల నుండి లక్ష రూపాయలకు పైగా ధరకు పలికి వరల్డ్ రికార్డు స్వంతం చేసుకుంది.
ఈ మిర్చిని ఆహార శుద్ధి పరిశ్రమలు, రెస్టారెంట్లు, బేవరేజేస్, పచ్చళ్ల తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ మిరప రకానికి అంతర్జాతీయంగా మరీ ముఖ్యంగా తూర్పు ఆసియాలో విపరీతమైన డిమాండ్ ఉంది. చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. GI ట్యాగ్ పొందిన చపాట రైతులకు శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. వరంగల్ చపాట మిర్చి ఇక్కడి రైతులు వారసత్వ పంటగా కొనసాగుతుంది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ తో మరింత మేలు జరుగుతుంది. ఓరుగల్లు చపాట మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..