
Lucky Zodiac Signs in April: ఏప్రిల్ నెలలో మూడు ముఖ్యమైన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. మార్చి 29న మీన రాశిలోకి మారే శనితో పాటు కుజుడు కర్కాటకంలోకి, రవి మేషంలోకి మారబోతున్నాయి. ఈ మూడు గ్రహాల రాశి మార్పు ప్రభావం తప్పకుండా వివిధ రాశుల మీద ఉంటుంది. అయితే, వృషభం, మిథునం, సింహం, తుల, మకరం, కుంభ రాశులవారికి ఈ మార్పువల్ల కొన్ని కీలకమైన భాగ్య యోగాలు, అధికార యోగాలు సంప్రాప్తించే అవకాశం ఉంది.
- వృషభం: ఈ మూడు గ్రహాల రాశి మార్పువల్ల ఈ రాశివారికి అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి సంబంధమైన ఆదాయం కూడా లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు సమసిపోయి, మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి.
- మిథునం: గ్రహాల మార్పుతో వీరి ధన, లాభ స్థానాలకు బలం పెరుగుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫ లమవుతుంది. ఉద్యోగ లాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వమూలక గుర్తింపు లేదా ధన లాభం కలుగుతుంది. వృత్తి,వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి భాగ్య, లాభ స్థానాలకు బలం పెరుగుతున్నందువల్ల విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
- తుల: ఈ రాశికి శనితో పాటు, కుజ, రవులు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కెరీర్ పరంగా రాజయోగాలు కలుగుతాయి. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి.
- మకరం: ఈ రాశికి ఏలిన్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయినందువల్ల దీని శుభ ఫలితాలు ఏప్రిల్ నుంచి అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరిగిపోతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ది ప్రయత్నాలు బాగా సఫలమవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ సమర్థతను గుర్తించి పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ఏప్రిల్ నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. రాశినాథుడైన శని ధన స్థానంలో ప్రవేశించి ఉచ్ఛ శుక్రుడితో యుతి చెందడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులన్నీ సానుకూలంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా పురోగమిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.