
ఉన్మాదులుగా మారారు.. కట్టుకున్న భార్యలను కడతేర్చారు.. ఇద్దరు వ్యక్తులు తమ భార్యలను పొట్టనపెట్టుకున్న దారుణ ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది.. ఒక వ్యక్తి.. మగ సంతానం కలగడం లేదని భార్యను చంపగా.. మరొకరు.. తరుచూ గొడవలతో పుట్టింటికి వెళ్లిందని.. భార్యను నడిరోడ్డు పై గొంతు కోసి చంపేశాడు. ఈ వరుస ఘటనలు తెలంగాణలో సంచలనంగా మారాయి.. వివరాల ప్రకారం.. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో దారుణం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాం మొదటి భార్యకు సంతానం కలగకపోవడంతో మగ పిల్లాడు కావాలని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య డోకే బానక్కకు రెండు కాన్పుల్లోను ఇద్దరు ఆడ పిల్లలే జన్మించారు. మగ పిల్లాడి కోసమే నిన్ను వివాహం చేసుకున్నానంటూ నిత్యం భార్య బానక్కతో గొడవ పడేవాడు. మొదటి భార్యను సైతం తీవ్రంగా కొట్టేవాడు. బుధవారం రాత్రి రెండో భార్య భానక్కతో ఇదే విషయంలో గొడవ జరగగా.. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైనభర్త జయరాం వ్యవసాయానికి ఉపయోగించే పలుగుతో బానక్క తల మీద బలంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బానక్క అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందింది. మృతిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన మరువక ముందే ఉమ్మడి ఆదిలాబాద్‌లో మరో భర్త రాక్షసుడిగా మారి తన భార్యను పొట్టనపెట్టుకున్నాడు. వంజరీ ఘటన మాదిరిగానే భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు.. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గుడిహత్నూర్ కి చెందిన కీర్తికి కొన్నేళ్ల క్రితం ఎల్. మారుతి అనే వ్యక్తితో వివాహం అయింది. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కానీ ఏడాదిగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం.. భర్త వేధింపులు తాళలేక.. భార్య కీర్తి.. పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. నాలుగు రోజులు క్రితం ఈ విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ సైతం జరిగింది. అప్పటి నుంచి కీర్తి భర్త మారుతి సైతం గుడిహత్నూర్‌లోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం అత్తమామ పనికి వెళ్లిన సమయంలో భార్యభర్తలు కీర్తి మారుతిలు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. వీధిలో పబ్లిక్ కుళాయిలో నీళ్లు వస్తుండటంతో తాగునీరు తెస్తానని భార్య బిందె తీసుకుని వీధిలోకి వెళ్లింది. అంతలోనే ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఉగ్ర రూపంతో వచ్చిన భర్త మారుతి అంతే కోపంతో భార్య కీర్తి మెడపై పదునైన కత్తితో పబ్లిక్ కుళాయి వద్దే దాడి చేశాడు. అంతే ఊహించని ఘటనతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
స్థానికులు తేరుకునే లోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే కీర్తి మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. కీర్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సె మహేందర్ ఘటనస్థలాన్ని పరిశీలించారు. భర్త మారుతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..