
ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు. అయితే.. కచ్చితంగా అవకాశం వస్తుందని భావించారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా? అనేది ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మంచి పేరుంది. కానీ, తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా జీవన్ రెడ్డి కి అవకాశం కల్పించలేదు. జీవన్ రెడ్డి కి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు నిరాశ గురవుతున్నారు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దాంతో పార్టీ అధిష్టానం నరేందర్ రెడ్డి కి టికెట్ ను కేటాయించింది. అంతకుముందు జగిత్యాల నియోజకవర్గం లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలోనూ ఆయన పార్టీ తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై ఆయన అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. సంజయ్ తో విభేదాల కారణంగా ఆయన చేరికల పై విమర్శలు చేశారు. అయితే ఆ సమయంలో పార్టీ సీనియర్ నేత, మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జగిత్యాల కెళ్ళి ఆయనను సముదాయించారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని భావించారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీలో జీవన్ రెడ్డి కి అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రిగా అవకాశం వస్తుందని అయన అనుచరులు భావించారు.
లేదంటే శాసనమండలి చైర్మన్ అవుతారనే చర్చ కూడా సాగింది. కానీ అయన పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయాన్ని పాటించిందంటూ జీవన్ రెడ్డి చెబుతున్నారు. అంత కంటే మించి నేను ఏమి మాట్లాడానని అన్నారు. బయటికి అలా చెబుతున్నా.. లోపల మాత్రం అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉండి కూడా తనకు అవకాశాలు రాకపోవడంతో ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన వేరే దారి చూసుకుంటారా? అనే టాక్ కూడా నడుస్తోంది. ఒక వేళ ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి అధిష్టానం ఆయనను కూల్ చేస్తుందా? అనేది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.