

మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం, రక్తాన్ని శుభ్రం చేయడం, నీటి సమతుల్యతను కాపాడటం, రక్తపోటును నియంత్రించడం వంటి ముఖ్యమైన పనులు చేస్తాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవన విధానం పాటించకపోతే మూత్రపిండాల పనితీరు మందగించి, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ డ్రింక్స్ లో ఎక్కువగా కెఫిన్, చక్కెర, రంగులు, రుచులను మెరుగుపరిచే రసాయనాలు, కొన్ని మూలికా పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి తాత్కాలిక శక్తిని అందించినా.. అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు కలిగించవచ్చు. ఈ డ్రింక్స్ మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని త్వరగా తగ్గించడమే కాకుండా.. ఎక్కువగా మూత్రం పోవడానికి కారణమవుతుంది. తగినంత నీరు తాగకుండా ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగితే నీటి లోపం వస్తుంది. దీని వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు బలహీనపడుతుంది.
రక్తపోటు పెరగడం
ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ రక్తనాళాలను ప్రభావితం చేసి రక్తపోటును పెంచే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉంటే మూత్రపిండాల పనితీరు దెబ్బతిని.. దీర్ఘకాలంలో మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
చక్కెర ప్రభావం
చాలా ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక స్థాయిలో చక్కెర ఉంటుంది. ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
మూత్రపిండాల్లో రాళ్లు
కొన్ని ఎనర్జీ డ్రింక్స్‌లో ఫాస్ఫారిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో కాల్షియం స్థాయిలను పెంచి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది.
కొన్ని పరిశోధనల ప్రకారం.. ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగేవారిలో మూత్రపిండాల పనితీరు మందగించే ప్రమాదం ఉందని తేలింది. ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ ఇంజురీ (AKI) అనే పరిస్థితి కొందరిలో తలెత్తే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మూత్రపిండాలు ఆకస్మాత్తుగా పనిచేయడం ఆపేసే తీవ్రమైన సమస్య. అయితే ఈ డ్రింక్స్ మూత్రపిండాల పనితీరును పూర్తిగా దెబ్బతీస్తాయా.? లేదా..? అనేది ఇంకా పూర్తిగా రుజువుకాలేదు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి..?
- ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు
- రక్తపోటు, మధుమేహం ఉన్నవారు
- గర్భిణీలు, పాలిచ్చే తల్లులు
- పిల్లలు, వృద్ధులు
ఆరోగ్యకరమైన డ్రింక్స్
- ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా సహజమైన డ్రింక్స్ లను ఎంచుకోవడం మంచిది.
- కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, గ్రీన్ టీ, మజ్జిగ వంటి వాటిని తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు కలుగుతుంది.
- తగినంత నీరు తాగడం, మంచి ఆహారపు అలవాట్లు పాటించడం, శరీరాన్ని చురుకుగా ఉంచడం ద్వారా ఎనర్జీ డ్రింక్స్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎనర్జీ డ్రింక్స్ తక్షణ శక్తిని ఇచ్చినప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే వీటిని మితంగా తాగడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. వీటికి బదులుగా సహజమైన, ఆరోగ్యకరమైన డ్రింక్స్ ని ఎంచుకోవడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)