
అటు విద్య, ఇటు రైతు సంక్షేమం. ఒకేసారి రెండు అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరంగా మారనున్నాయి. శ్రీరామ నవమి వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ పలు వరాలు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు.
మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు కాబోతోంది.
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 300 ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వేర్వేరు కోర్సుల అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ఎర్త్ సైన్సెస్ వర్సిటీలో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం లాంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రవేశాలు కల్పించే అరుదైన అవకాశం లభించనుంది.
ఇక సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి గాను సవరించిన అంచనా బడ్జెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను పెంచే అంశంపై ఇటీవల మంత్రివర్గంలో చర్చ కొనసాగింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న 7,926 కోట్ల అంచనాతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇచ్చింది. అనంతరం ప్రాజెక్ట్‌లో మార్పులు చేపట్టారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలోనే సీతమ్మ బ్యారేజీని కూడా చేర్చారు. దీంతో 2018 ఆగస్టులో ప్రాజెక్ట్ అంచనాలను 13 వేల 57 కోట్ల రూపాయలకు సవరించారు. ప్రస్తుతం ఆ అంచనాలను 19 వేల 324 కోట్ల రూపాయలకు సవరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4 లక్షల 15 వేల 621 ఎకరాలకు సాగు నీటిని, మరో 3 లక్షల 89 వేల 366 ఎకరాలను స్థిరీకరించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..