
ఆకాశంలో జరిగే అద్భుతాలను ఆసక్తిగా చూసేవారికి గొప్ప శుభవార్త. అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్ధులను చేసేందుకు.. ఈ యేడాదిలో మొదటి ఖగోళ అద్బుతం ఆకాశంలో జరగబోతోంది. జనవరి 21వ తేదీన ఆకాశంలో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతును మీరు చూసి ఉంటారు. అలాంటి దృశ్యమే ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేయనుంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి.. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీనిని ‘పరేడ్ ఆఫ్ ప్లానెట్స్’ ‘గ్రహాల కవాతు’గా పిలుస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇవాళ్టి ఆకాశంలో జరగబోయే ఈ అద్భుతంలో ఆరు గ్రహాలు.. శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యూరేనస్, ఒకే వరుసలో కనబడతాయి. యురేనస్, నెప్ట్యూన్లను చూడాలంటే టెలిస్కోప్ తప్పనిసరి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనుంది. జనవరి 21వ తేదీ, తిరిగి ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకేవరుసలో దర్శనమివ్వనున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
ఈ గ్రహాల కవాతు భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ గ్రహాల పరేడ్ దాదాపు నాలుగు వారాలు ఆకాశంలో కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతారు. ఈ గ్రహాలు సూర్యాస్తమయ సమయంలో, సాయంత్రం 8:30 గంటల సమీపంలో ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఆరు నుంచి ఏడూ గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని వదులుకోకండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..