

చెట్లు చేమలు మంచుదుప్పటి కప్పుకున్నాయి. ఈ క్రమంలో చెట్ల కొమ్మలకు సాలెపురుగులు అల్లుకున్న గూళ్లు ఆకట్టుకుంటున్నాయి. ఆ సాలెగూళ్ళు కూడా మంచుతో అల్లినట్టుగా విచిత్రంగా కనిపిస్తున్నాయి. ముత్యాలతో దండగుచ్చినట్టుగా సాలెగూడు మంచుబిందువులతో మెరుస్తూ కనిపిస్తోంది. మరోవైపు మెల్లగావీస్తున్న చలిగాలికి ఆ సాలెగూళ్లు రెపరెపలాడుతూ ఊగుతున్నాయి. అయినా అవి చెక్కు చెదరడంలేదు. ఈ ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చెట్ల ఆకులు, పువ్వులు అన్నీ మంచుతో నిండిపోయాయి. కొత్త అందాలను సంతరించుకుని ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. భద్రగిరిపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో హిమాలయాలను తలపిస్తోంది. పొగమంచును చీల్చుకొని భూమిని తాకుతున్న లేలేత సూర్య కిరణాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. మరోవైపు పొగమంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హెడ్ లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు.