
అతనో పారిశుద్ధ్య కార్మికుడు.. నెలకు ఓ రూ.15 వేల జీతం అందుకుంటూ ఉంటాడు. కానీ, అతను ప్రభుత్వానికి బాకీ పడిన ట్యాక్స్ ఎంతో తెలుసా? తెలిస్తే అవునా నిజమా అంత కట్టాలా అంటూ ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఒక ఏడాడికి ఏకంగా రూ.34 కోట్లు పన్ను చెల్లించాల్సిందిగా ఆదాయపు పన్ను విభాగం అధికారులు ఓ పారిశుద్ధ్య కార్మికుడికి నోటీసులు జారీ చేశాడు. పేరుకి పారిశుద్ధ్య కార్మికుడే కానీ వేరే ఆస్తులు బాగా ఉండి ఉంటాయని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. అతనికి ఎలాంటి ఆస్తులు లేవు. మరి రూ.34 కోట్ల పన్ను కట్టమని ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇస్తుందని అనుకుంటున్నారా..? అయితే పూర్తి స్టోరీ తెలుసుకోండి.
ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన కరణ్ కుమార్ ఖైర్లోని ఎస్బీఐ బ్రాంచ్లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి నెలకు రూ.15 వేల జీతం వస్తుంది. దాంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అతనికి ఓ నోటీసు వచ్చింది. ఆ నోటీసులో ఏముందో అతనికి అర్థం కాలేదు. కాస్త బాగా చదువు వచ్చిన వారికి అదేంటో అని చూపిస్తే.. వాళ్లు అందులో ఉన్న విషయం చదివి వినిపిస్తే.. కరణ్ కుమార్కు గుండె ఆగినంత పనైంది. ఆ తర్వాత కొద్ది సేపటికి వావ్ వాటే జోక్ అంటూ నవ్వుకున్నంత సీన్ క్రియేట్ అయింది.
ఆ నోటీసులో 2019-20 ఏడాదికి గాను రూ.34 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా కరణ్కుమార్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. నెలకు రూ.15 వేలు సంపాదించే తాను రూ.34 కోట్ల పన్ను ఎలా కడతానంటూ కరణ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. మరి కరణ్ కుమార్ పేరిట నోటీసులు ఎందుకు వచ్చాయి.. అంటే అతని పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కరణ్ కుమార్ గతంలో పనిచేసిన చోట తన యజమానికి తన పాన్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. బహుషా అతను ఏమైనా ఇతని పాన్ కార్డు దుర్వినియోగం చేసి ఉంటాడా అని భావిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.