

ప్రఖ్యాత నటుడు, చిత్రనిర్మాత దేబ్ ముఖర్జీ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. 83 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముఖర్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈయన కుమారుడే. 1960, 70 లలో దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో నటించారు. ఏక్ బార్ మూస్కురా దో (1972), జో జీతా వోహి సికందర్ (1992), లాల్ పత్తర్ (1971) వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కాగా దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరగనున్నాయి.
ఆయన మృతిపట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలతో పాటు, ముంబై సాంస్కృతిక రంగంలో దేబ్ ముఖర్జీ గణనీయమైన పాత్ర పోషించారు. అక్కడ జరిగే దుర్గా పూజ వేడుకల్లో ఒకటైన నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ నిర్వాహకులలో ఆయన ఒకరు . కాగా అయాన్ ముఖర్జీ ప్రస్తుతం హృతిక్ రోషన్, ఏన్టీఆర్ లతో వార్ 2 మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు తండ్రి మరణంతో ఆయన అయాన్ కొన్ని రోజులు వార్ 2 షూటింగ్కు బ్రేక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ రోజు సాయంత్రం ముంబైలోని జుహులోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగే అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రముఖ నటి తనూజ, కాజోల్, రాణి ముఖర్జీ, నటుడు అజయ్ దేవ్గన్, దర్శకుడు ఆదిత్య చోప్రా, అశుతోష్ గోవారికర్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ కుటుంబంలో దేవ్ ముఖర్జీ చాలా సన్నిహితుడు కాబట్టి, రణ్బీర్ కపూర్ , అలియా భట్ వంటి ఇతర తారలు కూడా అంత్యక్రియలకు హాజరు కావచ్చు.