
కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం(ఏప్రిల్ 20) బెంగళూరులోని ఉన్నత స్థాయి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బీహార్‌లోని చంపారన్‌కు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి, 1981 బ్యాచ్ అధికారి. తన మూడంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. పదునైన ఆయుధం వల్ల గాయాలున్న అతని మృతదేహాన్ని అతని భార్య పల్లవి గుర్తించి, పోలీసులకు సమాచారం అందించిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది.
ప్రాథమిక దర్యాప్తులో ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ప్రమేయం, బహుశా కుటుంబ వివాదం కారణంగానే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓం ప్రకాష్‌ను మూడుసార్లు పొడిచి చంపారని, హత్యకు ఉపయోగించిన కత్తిని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదం నేపథ్యంలో అతని భార్య పల్లవి, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రకాష్ కొంతమంది సన్నిహితుల ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ మాట్లాడుతూ, “ఆదివారం సాయంత్రం 4 నుండి 4:30 గంటల ప్రాంతంలో మాజీ డీజీపీ ఓం ప్రకాష్ మరణం గురించి సమాచారం అందిందన్నారు. ఆయన కుమారుడిని సంప్రదించి, ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై, వివరణాత్మక దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సీపీ తెలిపారు. పదునైన ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోందని, దానివల్ల చాలా రక్తాన్ని కోల్పోయి మరణానికి దారితీసిందని పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు.
కర్ణాటక 38వ డీజీపీగా మార్చి 1, 2015న నియమితులైన ఓం ప్రకాష్ విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఆయన హోమ్ గార్డ్స్ కమాండెంట్ జనరల్‌తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కుల అమలు, కర్ణాటక లోకాయుక్త, నేర పరిశోధన విభాగం (CID)లో పనిచేశారు. ఆయన రవాణా కమిషనర్‌గా కూడా సేవలందించారు. కార్వార్ జిల్లాలోని భట్కల్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఓం ప్రకాష్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, బెంగళూరులో జరిగిన రెండు ప్రధాన ఉగ్రవాద సంఘటనల దర్యాప్తులో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 17న బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న జరిగిన చర్చి స్ట్రీట్ పేలుడు ఘటనల సమయంలో ముఖ్య భూమిక పోషించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..