
ఇంట్లో చేపలు వండితే వంటగదిలోనే కాదు.. కొన్నిసార్లు ఇంటి మొత్తం వాసనతో నిండి ఇబ్బందికరంగా మారుతుంది. చేపల వంటలు ఇష్టపడే వాళ్లకే కొన్నిసార్లు ఆ వాసన అసహ్యంగా అనిపించవచ్చు. ఇది వంట సమయంలో గాలి ప్రసారం సరిగ్గా లేకపోతే, ఫ్రిజ్లో చేపలు నిల్వ చేసే తీరు సరిగ్గా లేకపోతే లేదా వంట తర్వాత సరైన శుభ్రత లేకపోతే వాసన మరింతగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వంట ముందు, తర్వాత తీసుకునే కొన్ని చిన్న జాగ్రత్తలు ఈ సమస్యను దూరం చేయడంలో ఎంతో ఉపయోగపడుతాయి.
చేపల వంట మొదలయ్యే ముందు గాలి తేరుగా ప్రవహించేలా కిటికీలు తెరవడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయడం లాంటి మార్గాలు వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వంట సమయంలో అల్లం, వెల్లుల్లి, పుదీనా వంటి దినుసులను ఎక్కువగా వాడటం వలన వాసన తగ్గుతుంది. వంట తర్వాత కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే మిగిలిపోయిన దుర్వాసనను తొలగించవచ్చు.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు వేసి మరిగించాలి. ఈ మిశ్రమం వాసనను తగ్గించడమే కాకుండా ఇంటి అంతటా తీపి వాసనను వెదజల్లుతుంది. అలాగే ఒక కప్పు నీటిలో ఒక చెంచా తెల్ల వెనిగర్ వేసి స్టవ్ మీద తక్కువ మంటలో మరిగించాలి. దీని వాసన కూడా చేపల దుర్వాసనను కప్పిపుచ్చుతుంది.
చేపల వంట తర్వాత వాష్ బేసిన్లో మిగిలే వాసన కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనిని తగ్గించేందుకు ముందుగా కొంత బేకింగ్ సోడా పోసి.. తర్వాత వెచ్చటి వెనిగర్ నీటిని పోస్తే శుభ్రతతో పాటు వాసన కూడా పోతుంది. అలాగే వాసన ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కొద్దిగా బేకింగ్ సోడా చల్లితే, అది ఆ వాసనను త్వరగా గ్రహించి అక్కడి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. చేపలు శుభ్రం చేసిన తర్వాత సింక్లో నిమ్మకాయ ముక్కను రుద్దడం వల్ల కూడా వాసనను తొలగించవచ్చు. అలాగే నిమ్మకాయ లేదా నారింజ తొక్కలను పొడిగా చేసి చూర్ణం చేసి వంటగదిలో చల్లితే మంచి సుగంధ వాతావరణం కలుగుతుంది.
చేపలను ఫ్రిజ్లో ఉంచేటప్పుడు వాటిని అరటి ఆకులో చుట్టి పెట్టడం వల్ల దుర్వాసన వ్యాపించకుండా ఉంటుంది. వంట పూర్తయ్యాక వాడిన గిన్నెలను వెంటనే కడగడం, శుభ్రంగా ఉంచడం, చేపలు శుభ్రం చేసిన నీటిని ఆలస్యం లేకుండా పారేయడం కూడా అవసరం. వంట తర్వాత చెత్తను కూడా వెంటనే బయటకు పారేయాలి. ఇవన్నీ పాటించడం వల్ల వాసన వ్యాపించకుండా.. ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు.
ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల మీరు చేపల వంటను సంతోషంగా, ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఇంట్లో చెత్త వాసన లేకుండా మంచి సువాసన ఉండేలా ఉండాలంటే.. ఈ మార్గాలను పాటించండి. ఇవి సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేవే. పైగా ఖర్చు కూడా తక్కువగా ఉండటం వల్ల ఎవరైనా సులభంగా ఫాలో అవొచ్చు.