

పోసాని కృష్ణ మురళి ఒకరోజు సీఐడీ విచారణ ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావేశంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు… ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా సమావేశం పెట్టారా లేక మరెవరైనా ఫోటో తయారు చేసి సమావేశం పెట్టమని ఆదేశించారా అనే కోణంలో కస్టడీలో సీఐడీ అధికారులు పోసానిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు అయితే పోసానిని మరోసారి కస్టడీ విచారణకు తీసుకోవాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో పోసాని ప్రదర్శించారు. దీనిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు. గత బుధవారం స్థానిక కోర్టులో పోసానిని హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. అయితే పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు మంగళవారం న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో అధికారులు విచారించారు.
పోసాని కృష్ణ మురళి వైసీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పని చేశారు. అయితే పోసాని కృష్ణమురళి వివిధ సమయాల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌తోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పోసానిపై పలువురు వ్యక్తులు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు.