
వేసవి రోజుల్లో ఎక్కువ వేడి కారణంగా శరీరానికి చల్లదనం అవసరమవుతుంది. ఈ సమయంలో చాలా మంది ఎక్కువగా పెరుగు తింటారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రుచి కూడా బాగా ఉండి.. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగును రోజూ తినేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే పెరుగు నిల్వ చేసే విషయంలో కొంత అప్రమత్తత అవసరం. సరైన పాత్రలు లేకుండా పెరుగు నిల్వ చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం కలగొచ్చు.
ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.. చాలా మంది ఇష్టానుసారంగా ఏ పాత్రలోనైనా పెరుగు నిల్వ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పాత్రలు పెరుగు నిల్వ చేయడానికి మంచివి కావు. ముఖ్యంగా ఇత్తడి, రాగి పాత్రల్లో పెరుగు నిల్వ చేయటం చాలా ప్రమాదకరం. ఈ రెండు లోహాలు పెరుగులో ఉండే ఆమ్లాలతో స్పందిస్తాయి. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రాగి లేదా ఇత్తడి లోహాలను ప్రభావితం చేసి రసాయనిక మార్పులకు దారి తీస్తుంది. అలా జరిగితే విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి.
ఇలా ఏర్పడే పదార్థాలు కడుపులోకి పోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కడుపు నొప్పి, వాంతులు, తల నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. కొన్నిసార్లు అది ఫుడ్ పాయిజన్ లాంటి పెద్ద సమస్య కూడా కావచ్చు. ముఖ్యంగా పిల్లలు లేదా పెద్దవాళ్లు అలాంటి పెరుగు తింటే ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతారు.
కొన్ని ఇళ్లలో పెద్దవారు వాడే సాంప్రదాయ పాత్రల్లోనే పెరుగు ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా పాతకాలంలో రాగి పాత్రలు ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. ఒకవేళ పొరపాటుగా రాగి లేదా ఇత్తడి పాత్రలో పెరుగు పెట్టినా దానిని తినడం మంచిది కాదు. పెరుగులో ఉన్న ఆమ్లత ఈ లోహాలపై ప్రభావం చూపి ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.
పెరుగు నిల్వ చేయడానికి గాజు సీసాలు చాలా మంచివి. అలాగే మట్టి కుండలు కూడా మంచి ఆప్షన్. అవి సహజంగానే చల్లగా ఉంటాయి. సిరామిక్ గిన్నెలు కూడా వాడొచ్చు. వీటితో పాటు స్టీల్ గిన్నెలు కూడా మంచివే. ఈ గిన్నెలు పెరుగుతో కలిసి కెమికల్ రియాక్షన్ జరపవు. పెరుగు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎలాంటి హాని ఉండదు. పెరుగు రుచి కూడా మారదు. అందుకే వీటిని తీసుకోవడం మంచిది.
చిన్న మిస్టేక్ జరిగినా మన ఒంటికి మంచిది కాదు. అందుకే ఎప్పుడు పెరుగు తోడు పెట్టినా ఏ గిన్నెలో పెడుతున్నామో ఒకసారి ఆలోచించాలి.