
రన్యారావు.. అమ్మాయి బాగుందని..ముచ్చటపడేరు. ఖతర్నాక్ లేడీ. అమ్మాయి హీరోయిన్ కదాఅని జాలిపడేరు.. .పక్కా ఫోర్ట్వంటీ. ఇప్పడీ బంగారు తల్లి పేరు దేశం మొత్తం మార్మోగుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ స్కూల్లో కొత్త పాఠాలు నేర్చుకుని.. కిలోల లెక్కన బంగారాన్ని చాలా పకడ్బందీగా.. పద్దతిగా తరలిస్తూ కోట్లు వెనకేసుకుని కూర్చుంది. దొంగ బంగారాన్ని దొర వేషంలో దొంగచాటుగా చేరవేయడంలో ఎన్ని డిగ్రీ పట్టాలు తీసుకుందో కానీ.. కాళ్ల పట్టీల దగ్గర నుంచి నుదుటి పాపటి దాకా పసిడిని ఒడిసి పట్టిదంంటే తస్సాదియ్యా మానవుడి కంటికి కనిపించదు. AI టెక్నాలజీ కెమెరాకు చిక్కదు. అంతటి కిలాడీ.. ఈ కిలేడి..!
మార్చి 3వ తేదీన ఏ ముహూర్తాన బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిందో కానీ.. ఈ సింగారమ్మ
గోల్డ్ దెబ్బకు ఇప్పుడు కర్నాటక రాజకీయ కూసాలు కదిలిపోతున్నాయి. అసలే కన్నడ పాలిటిక్స్ ఎంత ఇంపుగా ఉంటాయో అందరికి తెలుసు. ఎక్కడ ఏ దగుల్బాజీ దందా జరిగినా.. దానికి అక్కడి పాలిటిక్స్‌కు లింకయి సింకై.. రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇప్పుడదే జరుగుతోందక్కడ. పోనీ అక్కడ దాకా ఆగిందా అంటే.. ఐపీఎస్ ఆఫీసర్ల దాకా పాకింది. ప్రొటోకాల్ రగడ అంటుకుంది. పోనీ అంతటితో ఆగిందా అనుకుంటే..చివరకు మన టాలీవుడ్ కొంపకూ నిప్పు అంటుకుంది. తరుణ్ రాజ్ కొండూరు అట. పాపం ఈ పిలకాయ పరిచయం అనే సినిమాతో టాలీవుడ్ జనాలకు పరిచయం అయ్యాడు. తర్వాత పత్తాలేకుండా పోయాడు. చివరికి రన్యారావు పణ్యమా అని ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తేలాడు.
పసిడి దందాలో ఈ పిలకాయకీ ఘనమైన వాటానే ఇచ్చింది రన్యా మేడమ్. తురుణ్కు విరాట్ అని ఇంకో పేరు కూడా ఉంది. రన్యారావుతో 2019నుంచి తరుణ్‌రాజ్‌కు పరిచయం ఉన్నట్లు డీఆర్ఐ విచారణలో తేలింది. అప్పట్నుంచి క్రమ క్రమంగా రన్యారావుతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగిస్తూ, అవి కాస్తా అక్రమాలకు దారి తీసేంతగా వారి మధ్య బంధం బలపడిందట. అదెలాగో చెప్పే ముందు మనం రన్యారావు తన స్టేట్మెంట్లో ఎన్ని సుద్ధపూస కబుర్లు చెప్పిందో ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా అమాయకురాలిని. ఫస్ట్ టైమ్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలాంటి దొంగపని చేయలేదు. యూట్యూబ్‌లో గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. దాని ప్రకారమే బంగారం తరలించే పనికి ఒప్పుకున్నాను. అంతే తప్ప నాకెలాంటి పాపం తెలియదు. నేను చాలా మంచిదాన్ని అంటూ ఓ స్టేట్మెంట్ పోలీసులకు ఇచ్చింది. ఇంకో స్టేట్మెంట్లో ఎవడో తనను బ్లాక్మెయిల్ చేశాడని, బంగారం తరలిచ్చేలా తనపై ఒత్తిడి చేశాడని, అందుకే తానిలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
కానీ పైకి కనిపించేంత అమాయకురాలేం కాదు రన్యారావు. అంతా ప్రీప్లాన్డ్‌గానే ఈదందాలోకి దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తరుణ్ రాజ్‌తో కలిసి ఈవిడ సాగించిన స్మగ్లింగ్ దందా లోతుల్లోకి వెళ్తే విస్తుపోయే వాస్తవాలు డీఆర్ఐ విచారణలో తేలాయి. 2023లో రన్యారావు, తరుణ్‌రాజ్ 50-50 భాగస్వామ్యంతో వీర డైమండ్స్ ట్రేడింగ్ LLC అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం బంగారం కొనడం.. అమ్మడం.. రన్యా ప్రధాన పెట్టుబడిదారిణిగా వ్యవహరించగా, తరుణ్ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను స్వీకరించాడు. కంపెనీ కోసం రన్యా HDFC బ్యాంక్ ఖాతా ద్వారా సుమారు 10లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు కూడా దర్యాప్తులో తెలిసింది. తరుణ్ ఆపరేషనల్ భాగస్వామిగా యాక్టివ్ రోల్ పోషించాడు. దుబాయ్‌లోని డీలర్లకు చెల్లింపులు విదేశీ కరెన్సీలో జరిగాయని DRI అధికారులు కనుగొన్నారు.
అయితే, దుబాయ్‌లో ఓ డీలర్ తో జరిగిన డీల్ ఫెయిల్ కావడంతో.. రూ. కోటి 70లక్షల వరకు నష్టపోయారు. రన్యా ఈ మొత్తాన్ని మన దేశం నుంచి దుబాయ్‌కు హవాలా ద్వారా బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాదు అంతర్జాతీయ బంగారం మార్కెట్లో, ముఖ్యంగా జెనీవా, బ్యాంకాక్ డీలర్లతో రన్యారావుకు బలమైన సంబంధాలున్నాయి. ఈ ప్రాంతాల నుంచే రన్యా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. ఇటు తరుణ్ రాజ్ కూడా బంగారం మార్కెట్లో కింగ్‌పిన్ అయ్యేందుకు రన్యారావుతో సంబంధాలు కొనసాగించాడని తెలుస్తోంది.
ఇద్దరు పైకి కనిపించేంత సుద్దపూసలైతే కాదని తెలుస్తోంది. పైగా తరుణ్ రాజ్ కు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉంది. దుబాయ్ చెక్‌పోస్టుల నుంచి అమెరికా పాస్‌పోర్ట్ ద్వారా బంగారాన్ని దాటించినట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. రన్యారావు వెనుక కింగ్‌పిన్‌గా ఉన్నది తరుణ్ రాజేనని పోలీసులు నిర్ధారించారు. ఇద్దరూ కలిసే స్మగ్లింగ్ దందాకు దిగినట్లు డీఆర్ఐ చెబుతోంది. అంతేకాదు రన్యారావు దుబాయ్ ట్రిప్ వేసినప్పుడల్లా.. తురణ్ రాజ్ కూడా వెళ్లేవాడని డీఆర్ఐ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. రన్యారావు-తరుణ్ రాజ్ దొందూ దొందే..! పోలీస్ భాషలో చెప్పాలంటే దొంగ.. దొంగది. సో.. గోల్డ్ స్మగ్లింగ్ యవ్వారంలో ఒక సినీ నటుడి పాత్ర ఉందని డీఆర్ఐ నిర్థారించింది.
ఇంకా ఈ కేసులో తేలాల్సిన తలలు చాలానే ఉన్నాయి. వస్తున్న ఇన్‌పుట్స్‌ను బట్టి కన్నడ రాజకీయ నేతల మాటలను బట్టి చూస్తే.. రన్యారావు బ్యాగ్రౌండ్ చాలా పెద్దదని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్లోకి వెళ్లి తవ్వితే.. బంగారం లాంటి బ్రేకింగ్ న్యూస్ బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈవిడగారి టిప్‌టాప్ దొర వేషంలో చేసిన దొంగతనాలకు ఆద్యుడు.. ఆరాధ్యులు చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎవరే అతగాడు…అన్నదానిపై ఫోకస్ పెట్టింది డీఆర్ఐ. 14.8 కిజీల బంగారం…అంటే దాదాపు 15కిలోల బంగారం. రన్యారావు ఒంటిలోపల బయట దాచుకుని దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టు దాకా ఎలాంటి భయం బెరుకులేకుండా వచ్చింది. ఇదెలా సాధ్యం..? కిలో బంగారం తరలించేందుకే స్మగ్లర్లు నానా తంటాలు పడి దొరికిపోతుంటే.. ఈ మేడమ్ మాత్రం దుబాయ్‌కు ట్రిప్ వేసిన ప్రతీసారి కస్టమ్స్ కళ్లుగప్పి ఎలా తేగలగుతుంది. ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీనిపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
బసవన్న గౌడ మాటలు వివాదాస్పదంగా ఉన్నా.. వాస్తవం ఉందంటున్నారు కొందరు. లేకుంటే కిలోల కొద్దీ బంగారంతో ఓలేడీ ట్రావెల్ చేయడం సాధ్యమా. గతంలో పొట్టలో దాచుకుని డ్రగ్స్‌ను స్మగుల్ చేసిన సందర్భాలు ఎన్నో చూశాం. కానీ రన్యారావు అంతలా కష్టపడకుండానే గోల్డ్‌ను చాలా ఈజీగా స్మగ్లింగ్ చేస్తోందని డీఆర్ఐ అంటోంది. రన్యారావు దుబాయ్ ట్రిప్లపై ఆరా తీస్తే.. చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మామూలుగా ఎయిర్‌పోర్టులో తనిఖీలు చాలా పకడ్బందీగా ఉంటాయి. డొమెస్టిక్ చెకింగ్స్ కంటే.. ఇంటర్నేషనల్ చెకింగ్స్ చాలా లెవల్స్ దాటాల్సి ఉంటుంది.
రన్యారావు మార్చి3న మ్యాసివ్ గోల్డ్‌తో వస్తోందని DRI.. డెరెక్టరేట్ రెవిన్యూ ఇంటలిజెన్స్‌కు సమాచారం అందింది. సమాచారం అందగానే రన్యారావు ట్రావెల్ రిపోర్ట్‌ను డీఆర్ఐ పరిశీలించింది. అదేదో హైదరాబాద్ టు విజయవాడకు ట్రిప్లేసినట్లుగా.. రన్యారావు బెంగళూరు టు దుబాయ్‌కు వెళ్లి వస్తోందని తెలిసింది. 2024లో 30 సార్లు దుబాయ్ వెళ్లొచ్చింది. లాస్ట్ టూవీక్స్లో నాలుగు దఫాలు దుబాయ్ నుంచి బెంగళూరు వెళ్లొచ్చిందని తేలింది. దీంతో అధికారులకు అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. అంతేకాదు ఆమె ఫ్యామిలీ విషయాలపైనా ఆరా తీశారు. కర్నాటక పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కె. రామచంద్రరావు ఆమె స్టెప్ ఫాదర్ అని తెలిసింది. దీంతో ఆమెపై అనుమానం ఇంకా పెరిగింది. మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన రన్యారావు చెకింగ్ పాయింట్స్‌ను చాలా ఈజీగా దాటుకుని రావడం డీఆర్ఐ అధికారులు గమనించారు. ఆమె బయటకు రాగానే తనిఖీ చేయగా..14.8కిలోల బంగారం.. కేవలం ఆమె వేసుకున్న డ్రెస్‌లోనే దొరికింది. దుబాయ్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టు దాకా రావాలంటే.. ఇమిగ్రేషన్.. కస్టమ్స్.. గ్రీన్ చానల్ ఇలా సవాలక్ష చెకింగ్స్ దాటాలి. వీటన్నింటినీ రన్యారావు ఎలా దాటిందన్నది అధికారులకు సవాల్‌గా మారింది.
ఎయిర్ పోర్టుల్లో ఉండే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను రన్యారావును పట్టుకోలేదు. అక్కడుండే కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డగించలేదు. ఇన్ని చెకింగ్స్ దాటుకుని చాలా కాన్ఫిడెంట్‌గా రన్యారావు ఎయిర్‌పోర్టు నుంచి గోల్డ్‌తో ఎలా బాయటకు రాగలిగింది. ఇన్ని ప్రొటోకాల్స్‌ను ఆమె ఎలా బ్రేక్ చేస్తోంది..? ఇక్కడ పోలీసులు రైజ్ చేస్తున్న మేజర్ క్వశ్చన్స్..
రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటి సారా…? స్మగ్లింగ్‌లో రన్యారావు వెనుకున్న రింగ్ లీడర్ ఎవరు..? ఇన్ని లెవల్స్ చెకింగ్స్‌ను ఎలా బైపాస్ చేయగలుగుతున్నారు..? ఇందులో మీ ఫ్యామిలీ హస్తం ఉందా..? వీటన్నింటికీ రన్యారావు ఇస్తున్న సమాధానం.. తనకేం సంబంధంలేదని. ఇదే ఫస్ట్‌టైమ్ అని. పైగా ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే.. తానీ పని చేస్తున్నానని, కానీ ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో.. ప్రొటోకాల్ ఎలా బ్రేక్ చేస్తుందో రన్యారావు నోరు విప్పడంలేదు. కానీ పోలీసుల విచారణలో తేలిందేంటంటే…ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రతిసారి సేమ్ అవుట్‌ఫిట్.. అంటే సేమ్ లెదర్ జాకెట్, సేమ్ బెల్ట్ తో వస్తోందని తేలింది. అంటే రన్యారావు దుబాయ్ వెళ్లిన ప్రతిసారి..12-13కోట్ల విలువైన బంగారంతోనే భారతదేశానికి వస్తున్నారన్నది పోలీసుల మాట. మరి ప్రొటోకాల్ ఆమె ఎలా బ్రేక్ చేస్తున్నదే ఇంకా తేలలేదు. అయితే దీనికి బసవరాజు అనే కానిస్టేబుల్ సహకారం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈకేసులోముగ్గురిని అరెస్ట్ చేసింది DRI. నంబర్ వన్ రన్యారావు, నంబర్ 2 తరుణ్ రాజు, నంబర్ 3 బసవరాజు. ఇక్కడ బసవరాజు అనే వ్యక్తి ఇక్కడ కీరోల్ పోషించినట్లు తెలుస్తోంది. మామూలుగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో మనకన్నా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎయిర్‌పోర్టులో ప్రతి లెవల్లో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. వాటి లోపలి నుంచే ఎవరైనా వెళ్లాలి. వన్స్ అవి రెడ్ సైరన్ మోగిన ప్రతిసారీ తిరిగి వెనక్కి రావాలి. మళ్లీ సరిచూసుకుని అదే మెటల్ డిటెక్టర్ నుంచి లోపలకు వెళ్లాలి. కానీ రన్యారావు విషయంలో అలా జరిగిందా..? జరగలేదు.
ఇక దుబాయ్‌లో ఏ చిన్న మెటీరియల్ అయినా.. అంటే 24-25వేల ఖరీదు వరకు ఎలాంటి నిబంధన ఉండదు. అంతకుమించి ఏ వస్తువును తీసుకురావాలన్నా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక మెటల్ బేస్డ్ అంటే గోల్డ్ లాంటివి 15-20లక్షలు కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కంపల్సరీ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ పే చేయాలి. అలాంటిది దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి రన్యారావు ఇంత ఈజీగా ఇన్ని కిలోలు అక్కడి కళ్లు గప్పి తీసుకురావడం సాధ్యమా..? అంటే దుబాయ్‌లో కూడా రన్యారావుకు హై లెవల్లో భారీ నెట్వర్కే ఉండి తీరాలి..!
ఎయిర్‌పోర్టుల్లో రాజకీయనాయకులకు, బ్యూరోక్రాట్స్‌కు సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియలో స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. ముందుగానే వాళ్లు క్యారీ చేసే లగేజీని చెక్ చేసి.. మిగతా ఫార్మాలిటీస్ అన్ని త్వరగా పూర్తి చేసి త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు వారి వెంట ఓ స్పెషల్ ప్రొటోకాల్ ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడు రన్యారావు విషయంలోనూ ఇలాంటి వీఐపీ ట్రీట్మెంటే జరిగిందని డీఆర్ఐ అనుమానం. మరి ఎవరి ఆదేశాలతో రన్యారావుకు బ్యూరోక్రాట్లకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చారు..? ఇది తేలాల్సి ఉంది. దీని వెనుక ఇప్పుడు పట్టుబడ్డ కానిస్టేబుల్ బసవరాజు హస్తం ఉందన్న మాటా వినిపిస్తోంది. కానీ తనకేం తెలియదని బసవరాజు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ బసవరాజుకు తెలియకుండా ఇంత పెద్ద ఆపరేషన్ జరగదని డీఆర్ఐ భావిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం రన్యారావు ఫ్యామిలీపైనా డీఆర్ఐ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె సవతి తండ్రి రామచంద్రరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.
ఇలా రన్యారావు కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే ఉంది. ఆమెకు గత నవంబర్‌లో వివాహం అయింది. పెళ్లయిన నెల నుంచే తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్ హుక్కేరి ఇప్పటికే కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు. రన్యారావు స్మగ్లింగ్ దందాతో తనకెలాంటి సంబంధం లేదంటున్నాడు జతిన్. ఇలా రోజుకో పేరు తెరపైకి రావడంతో.. రన్యారావు కేసు వెనకాల అతిపెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఆమె పట్టుబడిన మరుసటి రోజు నుంచే.. ఓ విదేశీ ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరి ఎవరా రింగ్ లీడర్..?
రన్యారావు కేవలం కమిషన్ కోసమే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. కిలో బంగారం తరలిస్తే.. ఆమెకు సుమారు 5లక్షలు అందుతాయట.. అంటే 15కిలోలకు సుమారు 75లక్షలు కమిషన్. అందుకే ఇంత పెద్ద రిస్క్ చేస్తోందా అన్నదానిపైనా ఆరా తీస్తోంది DRI. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని.. రాజకీయ అండదండలతో తన సహచురుడు తరుణ్రాజ్తో కలిసి ఇంతపెద్ద గోల్డ్ దందా నడిపిస్తోందా.. అన్నది తేలాల్సి ఉంది..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..