

ప్రస్తుతం పసిడి పరుగులు బ్రేకులు లేవన్నట్లు పరుగులు పెడుతోంది. దీన్నే సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని విధాలుగా అడ్డుకున్న ఏ మార్గాన అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా గుజరాత్లో ఒక షాకింగ్ వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ నగరంలోని పాల్డి ప్రాంతంలోని ఒక స్టాక్ మార్కెట్ ఆపరేటర్ ఖాళీగా ఉన్న ఫ్లాట్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి. ఈ దాడిలో బృందం కనుగొన్నది చూస్తుంటే, అధికారుల కళ్ళు బైర్లు కమ్మినట్లు అనిపిస్తుంది.
స్టాక్ బ్రోకర్ క్లోజ్డ్ ఫ్లాట్ నుండి 107 కిలోల బంగారం, భారీ మొత్తంలో నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులకు సమాచారం అందిన తర్వాత ఈ దాడి జరిగింది. సోమవారం (మార్చి 17) మధ్యాహ్నం స్టాక్ మార్కెట్ ఆపరేటర్ పాల్డిలోని అవిష్కార్ అపార్ట్మెంట్స్లోని 104వ ఫ్లాట్‌పై దాదాపు 25 మంది అధికారులు దాడి చేశారు. ఈ ఫ్లాట్ యజమానులు మహేంద్ర షా, మేఘ్ షా అనే ఇద్దరు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
ఇటీవలి కాలంలో గుజరాత్లో ఇంత భారీ స్థాయిలో బంగారం, నగదు దొరకడం ఇదే తొలిసారి. ఆ బృందం ఫ్లాట్‌లో ఒక మూసి ఉన్న పెట్టెను గుర్తించింది. దాన్ని తెరిచినప్పుడు, తనిఖీ అధికారులు ఆశ్చర్యపోయారు. పెద్ద మొత్తంలో బంగారం దొరికిన తర్వాత, కెమెరాల నిఘాలో దానిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, స్టాక్ మార్కెట్ బ్రోకర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంత భారీ మొత్తంలో బంగారం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దర్యాప్తులో భాగంగా మరిన్ని విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో నోట్లను లెక్కించడానికి రెండు యంత్రాలు, బంగారం తూకం వేయడానికి విద్యుత్ త్రాసులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. వాటి మొత్తం బరువు 95.5 కిలోలు. ఇది కాకుండా, కొన్ని ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద, మార్కెట్లో దీని ధర రూ. 83 నుండి 85 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అంతే కాకుండా, ఈ దాడిలో దాదాపు రూ.60 నుంచి 70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..