
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Cricket Australia) 2025-26 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. ఈ జాబితాలో యువ ఆటగాడు సామ్ కాన్స్టాస్, ఎడమచేతి వాటం స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్, ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కు స్థానం లభించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా జట్టులో స్థిరపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే సామ్ కాన్స్టాస్ తన టెస్ట్ అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మలచుకున్నాడు. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌పై ఆడిన అతను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొని 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ జాబితాలో స్థానం కల్పించింది.
ఈ జాబితాలో మాథ్యూ కుహ్నెమాన్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతను 16 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే, మ్యాచ్ అధికారులు అతని బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తం చేసినా, బ్రిస్బేన్‌లోని నేషనల్ క్రికెట్ సెంటర్లో జరిగిన పరీక్షల తర్వాత అతనికి క్లియర్ లభించింది.
ఆస్ట్రేలియా జట్టు జూన్‌లో లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌లో మూడు టెస్టులు ఆడనుంది. ఈ సీజన్లో అత్యంత కీలకమైన యాషెస్ సిరీస్ కూడా జరగనుంది. నవంబర్‌లో పెర్త్ వేదికగా తొలి యాషెస్ టెస్ట్ ప్రారంభం కానుంది.
ఈసారి ఆస్ట్రేలియా జట్టు యువ ఆటగాళ్లకు పెద్దగా అవకాశం ఇచ్చింది. సామ్ కాన్స్టాస్, మాథ్యూ కుహ్నెమాన్, బ్యూ వెబ్‌స్టర్ వంటి ఆటగాళ్లు రాబోయే సంవత్సరాల్లో ఆసీస్ జట్టుకు కీలక ఆటగాళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో సమతుల్యమైన బలమైన జట్టును తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2025-26 ఆస్ట్రేలియా పురుషుల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
జేవియర్ బార్ట్లెట్ , స్కాట్ బోలాండ్ , అలెక్స్ కారీ , పాట్ కమ్మిన్స్ , నాథన్ ఎల్లిస్ , కామెరాన్ గ్రీన్ , జోష్ హాజిల్‌వుడ్ , ట్రావిస్ హెడ్ , జోష్ ఇంగ్లిస్ , ఉస్మాన్ ఖవాజా , సామ్ కాన్స్టాస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే , నాథన్ లియాన్ , మిచెల్ మార్ష్ , గ్లెన్ మాక్స్వెల్ , లాన్స్ మోరిస్ , జై రిచర్డ్సన్ , మాట్ షార్ట్ , స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్ , బ్యూ వెబ్‌స్టర్, ఆడమ్ జంపా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..