
అడవి రొయ్యల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?! అదేంటి రొయ్యలు సముద్రాలు చెరువుల్లో ఉంటాయి కదా అడవుల్లో ఏంటి..? అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి అడవి రొయ్యల కోసం అడిగితే.. దానికోసం పుంకాలు పుంకాలుగా చెబుతారు గిరిజనులు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే లభించే ఆ అడవి రొయ్యలను సొంతం చేసుకున్నందుకు ఒక యజ్ఞమే చేస్తారు గిరిజనులు. లొట్టలేసుకుని మరి.. వారెవ్వా ఏమి రుచిరా అంటూ తింటారు. అడవి బిడ్డలు అమితంగా ఇష్టపడే ఆ అడవి రొయ్య విశేషాలు ఏంటో తెలుసుకుందాం..!
అవి రొయ్యల్లా ఉంటాయి.. కానీ రొయ్యలు కావు..! సముద్రం చెరువుల్లో పెరగవు.. అడవుల్లోని ఈత దుబ్బుల్లో దాగి ఉంటాయి. వాటిని వండితే ఉంటది మరి.. అబ్బా.. ఏమి రుచిరా అని అనక మానరు తిన్నవాళ్ళు. రొయ్య టేస్ట్ ఏముంది.. వాటిని వండుకుని తింటే కమ్మగా ఉంటుందట. అతిధులకు ఈ సీజన్లో లభించే ఈ అడవి రొయ్యల కూరతో భోజనం పెడితే.. ఆ ఆతిథ్యం మరపురానిదని భావిస్తూ ఉంటారు. వసంతైన విందుగా భావించి అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా ఆరగిస్తారు.
వాస్తవానికి ఆదివాసీల ఆహారపు అలవాట్లు కట్టుబాట్లు విభిన్నంగా ఉంటాయి. ప్రస్తుత సీజన్లో అడవిలో లభించే ఈ రొయ్యలను బొడ్డెంగులుగా పిలుస్తుంటారు గిరిజనులు. ఈత మొక్కల మొదట్లో లభించే ఈ బొడ్డెంగులను.. మీసం లేని రొయ్యగా కూడా గిరిజనలు భావిస్తారు.
ఈ సీజన్లో మాత్రమే.. తవ్వి తీయాల్సిందే..!
ఈ బొడ్డెంగులు ఈ సీజన్లో మాత్రమే లభిస్తాయి. నవంబరు నుంచి మార్చి నెల వరకు మాత్రమే అడవుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిని సేకరించడం కూడా ఆషామాషీ కాదు. పెద్ద సాహసమే చేస్తుంటారు గిరిజనులు. కొండలు గుట్టలు వాగులు దాటుకుంటూ.. అడవుల్లోనే ఈత చెట్ల వద్దకు వెళ్తారు. ఎందుకంటే ఆ ఈత చెట్ల మొదళ్లలో ఉంటాయి ఈ బొడ్డెంగులు. గిరిజన ప్రాంతంలోని అడవిలో వేపుగా పెరిగే ఈత మొక్కల వేర్ల భాగంలో తవ్వి వాటిని సేకరిస్తారు అడవి బిడ్డలు.
అదృష్టం ఉన్నవాడికేనట..!
గొడ్డలితో మొదళ్లను తొలిచి.. కత్తులతో నరికి.. గునపాలతో తవ్వి.. వాటిని సేకరిస్తారు. ఒక్కొక్కటిగా సేకరించి.. ఆ బొడ్డేంగులు దొరికిన వాళ్ళ పంట పండినట్లే అని భావిస్తుంటారు గిరిజనులు. ఎందుకంటే ఇవి అన్నిచోట్ల దొరకవు అందరికీ లభించవు. అదృష్టం ఉన్నవాడికే ఆ అడవి రొయ్యలు దర్శనం ఉంటుందని నమ్ముతుంటారు గిరిజనులు.
కిలో వెయ్యి రూపాయలు..!
ఈ బొడ్డేంగులను ఒక్కొక్క దేశంలో ఒక్కోలా పిలుస్తుంటారు. వాస్తవానికి గిరిజనులు అడవి రొయ్యగా పిలుచుకొని ఈ బొడ్డెంగుల ను పామ్ వార్మ్ అంటారు..! దాని శాస్త్రీయ నామం రైంకోపోరస్ పోనీ సీన్. ఈత చెట్లు, తాటి చెట్ల మొదలలో ఇవి నివసిస్తాయి. అక్కడే.. శ్వేత దవ్వను తిని జీవిస్తాయి. మూడు నెలలు మాత్రమే లభించే ఈ బొడ్డెంగులను ఎలాగైనా సేకరించి తినాలని గిరిజనులు ఆరాటపడుతూ ఉంటారు. అందుకే కిలో వెయ్యి రూపాయల వరకు కూడా ధర పలుకుతూ ఉంటుంది. కొంతమంది స్వయంగా సేకరించి వాళ్లే అదృష్టంగా భావించి ఆరగిస్తే.. మరికొందరు వాటిని సంతల్లో అమ్మకానికి పెడుతూ ఉంటారు. వాటిని చూస్తే క్షణంలో కొనుగోలు చేస్తామని అంటున్నాడు చింతపల్లి ఏజెన్సీ పెద్ద గెడ్డకు చెందిన సింహాద్రి అనే గిరిజనుడు.
పసందైన వంటకంతో ఆతిథ్యం అదుర్స్..!
వాటిని సేకరించడం ఒక వంతు అయితే.. తీసుకొచ్చి దాన్ని వండడం మరో వంతు. ఎందుకంటే.. రొయ్యల కూర మాదిరిగానే దాన్ని వంటకం చేయాలట. సేకరించిన బొడ్డేంగులను.. వేడినీటిలో కాస్త కడిగి.. ఆ తరువాత ఉల్లిపాయలు టమాటా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టుతో కలిపి వండితే.. అబ్బా.. ఏమి రుచి రా గురు అని చెప్పక మానరట. దీని టేస్ట్ గురించి ఆదివాసీలే చెబుతుంటారు. వాటిని ఇంటికి వచ్చిన అతిథులకు పెడితే.. ఆ ఆతిథ్యం మరువలేని అంటుంటారు గిరిజనులు. ప్రెస్టీజియస్ గా ఆ వంటకాన్ని వండి అతిధులకు పెడుతూ ఉంటామని అంటున్నారు చింతపల్లికి చెందిన జల్లు సుధాకర్.
కబాబ్స్, దమ్ బిర్యానీ కూడా..
బొడ్డెంగులను గతంలో కూర వరకు మాత్రమే వంటకం చేసేవారు. కానీ ఇప్పుడు వాటికి కూడా విభిన్న రకాల డిష్ లను తయారు చేస్తున్నారు గిరిజనులు. కూరతో పాటు.. బొడ్డేంగుల ఫ్రై, కబాబ్స్, ప్రాన్ బిరియాని మాదిరిగానే బొడ్డెంగుల దమ్ బిర్యాని కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఆదివాసీలు. మరి కొంతమంది అయితే ఈ బొడ్డెంగలను స్టార్టర్స్ గా సిద్ధం చేసుకుని ఎంచక్కా మందుతో కలిపి నంచుకుని లొట్టలు వేసుకుని తింటున్నారు.
పొరుగు జిల్లాల నుంచి వచ్చి మరీ..
ఈ బొడ్డంగులు అల్లూరి ఏజెన్సీలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. జి.మాడుగుల పెదబయలు ముంచంగి పొట్టు చింతపల్లి ఏజెన్సీలో కొండ ప్రాంతంలోని ఈత చెట్ల మొదళ్లలో ఈ సీజన్లో మాత్రమే వెరివిగా లభిస్తూ ఉంటాయి. అది కూడా అన్ని చెట్లలో ఉండవు.. వెతికి వెతికి వాటిని పట్టుకోవాల్సిందే. వీటిని సొంతం చేసుకున్నందుకు పొరుగు జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ సీజన్లో ప్రత్యేకంగా అల్లూరు జిల్లాకు వస్తుంటారట. కొంతమంది అయితే ముందే అడ్వాన్స్‌గా చెప్పి ఉంచి.. ఒకవేళ బొడ్డెంగులు లభిస్తే తమకే ఇవ్వాలని కూడా చెప్పి తీసుకెళ్తారట. ఇదండీ ఈ అడవి రొయ్యలు బొడ్డెంగుల కూరకున్న క్రేజ్..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..