
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధించింది. దీని కింద గతంలో ఇచ్చిన వీసాలూ రద్దు చేసింది. భారత్‌లోని పాక్ హైకమిషన్‌లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్‌లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడించింది. ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయించింది. భారత్ ఇలా వెనువెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆ దేశ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. గురువారం ఉదయం మార్కెట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే భారీ నష్టాలను చూసింది. మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) 2.12 శాతం మేర పడిపోయింది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ దాదాపు 2,485 పాయింట్లు క్షీణించి 114,740.29కి చేరుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…