
కలిసి ఉంటే కలదు సుఖం అంటారు పెద్దలు. ఇది చాలా సందర్భాల్లో ఎవరికి వారికే అనుభవపూర్వకంగా నిజమని నిరూపితం అవుతుంటుంది. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై ఎవరికి వారు చిన్న చిన్న కుటుంబాలుగా జీవిస్తున్న పరిస్థితులు గ్రామాల్లో సైతం కనిపిస్తుంది. అయితే సాధారణ జీవితం ఎలా ఉన్నా ఏలూరు ఏజెన్సీలో ప్రజలు ఏడాదికి ఒక్కసారి సమిష్టిగా ఊరి చెరువులో చేపల జాతర నిర్వహిస్తున్నారు.
వేసవి కాలంలో చెరువులో చేపలు పెట్టడం జాతరలా ఉంటుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం నీళ్లలోకి దిగి, చేపలను పట్టి, వాటిని కుప్పలుగా పోసేవాళ్లు. సమానంగా జరిగే పంపకాలు.. ఇదే సమయంలో వినిపించే చలోక్తులు, సరదాగా సాగే దెప్పిపొడుపులు, అన్యాయం జరిగిందంటూ సాగే అలకలు. చిన్నా, పెద్దా , బాబాయ్, పిన్ని, అత్తా – మామ అంటూ వినిపించే పలకరింపులు మొత్తం ఒక జాతరలా కనిపిస్తుంది. వచ్చిన చేపలు సమానంగా పంచుకుని వండుకుని తింటారు. ఆ గ్రామాల్లో ప్రతి ఇంటా చేపల వంటకాలే..!
ఈ ఏడాది అదే వాతావరణంలో కుక్కునూరు మండలం చీరవల్లిలో చేపలు పెట్టడం జరుగుతున్నాయి. ఈ చెరువు పరిసరాల్లో దాదాపు పది గ్రామాల ప్రజలు నివసిస్తుంటారు. వర్షాకాలంలో నిండుకుండలా ఉండే చెరువులు వేసవిలో నీరు ఇంకిపోయి వెలవెల పోతుంటాయి. అదే సమయంలో గిరిజనులు అక్కడకు చేరుకుని చెరువులో దిగి చేపలు పెడతారు. బొచ్చా, శీలావతి, కొరమేను, వాలుగా ఇలా చాలా రకాల చేపలు దొరికాయి. ఇక, వాటిని పంచుకుని ఎవరి వాటా వాళ్లు చేపలను తామర ఆకుల్లో ఉంచుకుని ఇళ్లకు తీసుకువెళ్లారు. ఇక మంచి ఘుమఘుమలాడే చేపలు కూర వాసనలతో కుక్కునూరు పరిసర ప్రాంతాలు గత రెండు రోజులుగా సందడిగా మారాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెైస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..