

ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు 8 ఎకరాల్లో మామిడి తోట వేశారు. నాటిన నాలుగేళ్ల తర్వాత తొలిసారి మామిడితోట కాపుకొచ్చింది. దీంతో మామిడి చెట్లకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్థులను, బంధువులను తోటకు ఆహ్వానించి ఘనంగా ఆ తంతు నిర్వహించారు. అయితే ఇదేదో తూతూ మంత్రంగా చేశారనుకుంటే పొరపాటే. పెళ్లికొచ్చిన వారందరికీ సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. బీర్పూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ అర్చకుడు వొద్దివర్తి మధు కుమారాచార్యులు వేద మంత్రాలతో సంప్రదాయంగా మామిడి చెట్లకు వివాహం జరిపించారు. మొదటిసారి కాపుకొచ్చిన మామిడి చెట్లకు ఇలా వివాహం జరిపిస్తే మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు తోట ఎప్పుడు పచ్చగా ఉంటుందని విశ్వసిస్తారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇలా మామిడి చెట్లకు పెళ్లి జరపడం ఆనావయితీగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు.